తెలంగాణ హైకోర్టు
* పోలీసులకు హైకోర్టు నోటీసులు
* ఎఫ్ఐఆర్ లేకుండా తనిఖీలు..
* పోలీసుల వివరణ కోరిన హైకోర్టు
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణలో టాస్క్ఫోర్స్ పోలీసులు (Telangana Task Force Police) నిర్వహిస్తున్న సోదాలు, స్వాధీనాల వ్యవహారంపై హైకోర్టు (Telangana High Court) కీలకంగా స్పందించింది.
సివిల్ డ్రెస్లో విధులు నిర్వహిస్తూ, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే తనిఖీలు, విచారణలు, స్వాధీనాలు చేస్తున్నారన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ (Telangana DGP), హైదరాబాద్ పోలీస్ కమిషనర్, టాస్క్ఫోర్స్ డీసీపీలకు నోటీసులు జారీ చేసింది.
* టాస్క్ఫోర్స్ విధులపై పిటిషన్..
హైదరాబాద్లోని బొరబండకు చెందిన బి. బాలరాజ్ ఈ అంశంపై హైకోర్టులో రిట్ పిటిషన్ (Writ Petition) దాఖలు చేశారు. టాస్క్ఫోర్స్ పోలీసులు సివిల్ డ్రెస్లో ఉండి, తమ గుర్తింపును వెల్లడించకుండా సోదాలు నిర్వహిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే విచారణలు చేపట్టడం, వస్తువులను స్వాధీనం చేసుకోవడం చట్టపరమైన విధానాలకు విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది విజయ్ గోపాల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
* బీఎన్ఎస్ఎస్ నిబంధనలకు విరుద్ధమని వాదన..
భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (Bharatiya Nagarik Suraksha Sanhita – BNSS) 2023లోని సెక్షన్ 173(1) ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా దర్యాప్తు చేపట్టడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. పోలీసులు తనిఖీలు, స్వాధీనాలు చేపట్టేటప్పుడు పారదర్శకమైన విధానాలను పాటించాలని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులకు సంబంధించి తగిన రికార్డులు, పత్రాలు ఇవ్వడం లేదని కూడా ఆరోపించారు.
* సెర్చ్ వారెంట్ల జారీ అధికారంపై అభ్యంతరం..
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (Assistant Commissioner of Police – ACP)లు సెర్చ్ వారెంట్లు జారీ చేయడంపై కూడా పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం సెర్చ్ వారెంట్లు జారీ చేసే అధికారం న్యాయస్థానంలోని సంబంధిత మేజిస్ట్రేట్కే ఉంటుందని వాదించారు.
* డీజీపీకి హైకోర్టు నోటీసులు
ఈ అంశాలపై పోలీసు శాఖ వివరణ ఇవ్వాలని జస్టిస్ టి. మాధవీ దేవి ఆదేశించారు. పిటిషనర్ వాదనలు విన్న అనంతరం హైకోర్టు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. టాస్క్ఫోర్స్ సిబ్బంది సివిల్ డ్రెస్లో విధులు నిర్వహించడం, ఎఫ్ఐఆర్ లేకుండా సోదాలు, స్వాధీనాలు చేపట్టడం వెనుక ఉన్న చట్టపరమైన ఆధారాలను వివరిస్తూ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 15కు వాయిదా వేసింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

