PM Narendra Modi
* దేశంలో తొలి ఐఐటీగా చరిత్ర..!
ఆకేరు న్యూస్, డెస్క్: దేశంలోనే తొలి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)గా గుర్తింపు పొందిన ఐఐటీ ఖరగ్పూర్ 75 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్లాటినం జూబ్లీ (వజ్రోత్సవ) వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi )పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ చారిత్రక నేపథ్యం, దేశ సాంకేతిక అభివృద్ధిలో పోషించిన పాత్రను ఆయన గుర్తుచేశారు.
*ఎడ్లబండ్ల నుంచి బుల్లెట్ రైళ్ల వరకు..
ఐఐటీ ఖరగ్పూర్ వేడుకల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారతదేశం ఎన్నో రంగాల్లో గణనీయమైన మార్పులను చూసిందన్నారు. ఎడ్లబండ్ల నుంచి బుల్లెట్ రైళ్ల వరకు, ఉత్తరాల నుంచి సోషల్ మీడియా సందేశాల వరకు దేశ ప్రయాణం మారిందని పేర్కొన్నారు. ఈ పరిణామాల్లో దేశంలో తొలి ఐఐటీగా ఖరగ్పూర్ కీలక పాత్ర పోషించిందని చెప్పారు.
సాంకేతిక విద్య, పరిశోధన, ఆవిష్కరణల ద్వారా దేశ అభివృద్ధికి ఐఐటీ ఖరగ్పూర్ విశేషంగా దోహదపడిందని వివరించారు. ఐఐటీ ఖరగ్పూర్ ఉన్న ప్రాంతానికి ప్రత్యేకమైన చారిత్రక నేపథ్యం ఉందని ప్రధాని గుర్తుచేశారు. ఈ ప్రాంతంలోనే స్వాతంత్య్ర సమరయోధులను నిర్బంధించిన హిజ్లీ నిర్బంధ శిబిరం ఉండేదని పేర్కొన్నారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుల త్యాగాలకు ఈ ప్రాంతం సాక్షిగా నిలిచిందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రతో ముడిపడిన ఈ నేలపై ఐఐటీ ఖరగ్పూర్ రూపుదిద్దుకోవడం ప్రత్యేకతను సంతరించుకుందని తెలిపారు.
* 1951లో ప్రారంభమైన ప్రస్థానం..
ఐఐటీ ఖరగ్పూర్ 1951లో ప్రారంభమైంది. దేశంలో ఏర్పాటు చేసిన తొలి ఐఐటీగా ఇది గుర్తింపు పొందింది. సాంకేతిక విద్యలో నూతన ప్రమాణాలను నెలకొల్పుతూ పరిశోధన, ఆవిష్కరణలు, పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన నైపుణ్యాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
ఈ 75 ఏళ్ల ప్రయాణాన్ని పురస్కరించుకుని నిర్వహించిన వేడుకల్లో ప్రధాని మోదీ (PM Narendra Modi) 75 మంది విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. సంస్థ 75 ఏళ్ల ప్రస్థానానికి గుర్తుగా ప్రత్యేక స్మారక నాణేన్ని కూడా ఆవిష్కరించారు. ఐఐటీ ఖరగ్పూర్లో సాంకేతిక విద్యతో పాటు వైద్య విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కూడా విస్తరిస్తున్నాయి.
మెడిసిన్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం, అందుబాటు ధరల్లో వైద్య ఆవిష్కరణలు, ప్రజలకు చేరువయ్యే ఆరోగ్య సేవల అభివృద్ధిపై సంస్థ దృష్టి సారిస్తోంది. దేశ సాంకేతిక ప్రగతికి పునాదిగా నిలిచిన ఐఐటీ ఖరగ్పూర్ తన 75 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం భారత ఉన్నత విద్యా రంగంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
Also Read : పిఠాపురంలో అపోలో ఆరంభ్ ప్రారంభం..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

