Yuzvendra Chahal join to BJP
* బీజేపీలో చేరిన యుజ్వేంద్ర చహల్
ఆకేరు న్యూస్, డెస్క్ : టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ (Yuzvendra Chahal) రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. భారత క్రికెట్లో తన స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చహల్.. తాజాగా భారతీయ జనతా పార్టీలో (బీజేపీ) చేరారు. బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గ కమిటీలో ఆయనకు ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడిగా బాధ్యతలు అప్పగించింది.
వివరాల్లోకి వెళ్తే.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదేశాల మేరకు పార్టీ ఓబీసీ మోర్చాకు సంబంధించి కొత్త జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ నియామకాల్లో భాగంగా యుజ్వేంద్ర చహల్‌ను (Yuzvendra Chahal) ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడిగా నియమించారు. ఢిల్లీ నుంచి ఆయనకు ఈ అవకాశం కల్పించారు. చహల్‌తో పాటు మరో ఇద్దరిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు.
* బీజేపీ నేతతో చహల్ భేటీ..
ఈ నియామకానికి ముందు చహల్ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అమర్‌పాల్ మౌర్యతో సమావేశమయ్యారు. అనంతరం బీజేపీలో తనకు స్థానం కల్పించడంపై చహల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు అమర్‌పాల్ మౌర్యకు కృతజ్ఞతలు తెలిపారు.
* 37 మందితో జాతీయ కార్యవర్గం..
ఓబీసీ మోర్చా నూతన కమిటీలో భాగంగా ఏడుగురు జాతీయ ఉపాధ్యక్షులు, ముగ్గురు జాతీయ ప్రధాన కార్యదర్శులు, ఏడుగురు జాతీయ కార్యదర్శులను పార్టీ నియమించింది. వీరితో పాటు 37 మందిని జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేసింది. తెలంగాణకు చెందిన కడగంచి రమేష్‌కు సైతం జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు.
* క్రికెట్లో ప్రత్యేక గుర్తింపు
యుజ్వేంద్ర చహల్ భారత క్రికెట్ జట్టులో ప్రముఖ లెగ్ స్పిన్నర్‌గా గుర్తింపు పొందారు. వన్డేలు, టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆయన.. ఐపీఎల్‌లోనూ పలు జట్ల తరఫున ఆడారు. ఐపీఎల్ చరిత్రలో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించారు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు. క్రికెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చహల్.. ఇప్పుడు రాజకీయాల్లో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడంతో ఈ పరిణామం క్రీడా, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Also Read : హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం..!

Please tell us what is wrong. Your report will be sent to the website team.

