Karthika Purnima
* శివనామస్మరణతో మారుమోగిన ఆలయాలు
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి (Karthika Purnima) మహోత్సవ వేడుకలు మంగళవారం భక్తిశ్రద్ధలతో అత్యంత వైభవంగా జరిగాయి. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పలు శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. మహిళలు, యువతులు, చిన్నారుల రాకతో ఆలయాలన్నీ సందడిగా మారాయి.
జిల్లాలో ప్రసిద్ధిగాంచిన రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా ఏటూరునాగారం, మంగపేట, మల్లూరు, తాడ్వాయి, గోవిందరావుపేట, వెంకటాపూర్, వెంకటాపురం, మల్లంపల్లి, ములుగు తదితర మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లోని శివాలయాల్లోనూ కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమోగాయి.
భక్తుల సౌకర్యార్థం ఆయా దేవాలయాల కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. పూజారులు స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, పాడిపంటలతో గ్రామాలు సుభిక్షంగా ఉండాలని ఆశీర్వచనాలు అందజేశారు.
మరోవైపు దీపావళి పర్వదినం సందర్భంగా నోములు, వ్రతాలు ఆచరించలేని కొన్ని కుటుంబాలు కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక వ్రతాలు నిర్వహించాయి. ఇళ్లను, ఆలయాలను రంగురంగుల దీపాలతో అలంకరించి దీపారాధనలు చేశారు. దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు జిల్లా ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

