* టీవీవీపీ ఆసుపత్రుల సిబ్బందికి వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్

ఆకేరున్యూస్, వరంగల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీవీవీపీ ఆసుపత్రుల సిబ్బందికి వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో పని చేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి ఆరు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడం అమానుషమని చెప్పారు. ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పుకునే ముఖ్యమంత్రికి వీరి వెతలు కనిపించకపోవడం శోచనీయమన్నారు. జీతాలు చెల్లించాలని కోరుతూ సిబ్బంది ఎన్నిసార్లు నిరసనలు తెలియజేసినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా ఉండటం లేదని, వారి గోడును పట్టించుకోవడం లేదని విమర్శించారు. విషజ్వరాలు విజృంభించి రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్న సమయంలో, ఆసుపత్రుల నిర్వహణను ప్రభుత్వం గాలికి వదిలేసిందని నిప్పులు చెరిగారు. నిధులు విడుదల చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కాంట్రాక్టర్లకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం ఆసుపత్రి సిబ్బందికి శాపంగా మారిందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, టీవీవీపీ ఆసుపత్రుల్లో పని చేస్తున్న సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని హరీష్ రావు హెచ్చరించారు.
————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
