* ఏర్పాట్లను సమీక్షించిన సీఎస్
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఈనెల 28న రాష్ట్రానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒకరోజు పర్యటనకు వస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం అధికారులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు. 28న ఉదయం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవాన్ని, సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో జరిగే భారతీయ కళా మహోత్సవంలో రాష్ట్రపతి పాల్గొంటారని సీఎస్ వివరించారు. రాష్ట్రపతి రాక ఏర్పాట్లపై సమన్వయం ఉండేలా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని పోలీసులను కోరారు. విమానాశ్రయం, అలాగే రాష్ట్రపతి నిలయం, అన్ని వేదికల వద్ద తగినన్ని అగ్నిమాపక పరికరాలు ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాష్ట్రపతి ప్రయాణించే మార్గంలో కంటోన్మెంట్ బోర్డు, జీహెచ్ఎంసీ అధికారులతో రోడ్ల మరమ్మతులను చేపట్టాలని ఆర్ అండ్ బీ శాఖను ఆదేశించారు. సమీక్షలో డీజీపీ జితేందర్, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, డీజీ ఫైర్ సర్వీసెస్ నాగిరెడ్డి, గవర్నర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
