* కలెక్టర్, అధికారులపై దాడి ఘటనపై సర్కారు అప్రమత్తం
* దాడికి పాల్పడ్డ 52 మంది అరెస్ట్
ఆకేరు న్యూస్, వికారాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanthreddy) సొంత నియోజకవర్గం కొడంగల్(Kodangal)లోని లగచర్ల లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఫార్మా కంపెనీ(Farma Company) ఏర్పాటుపై నిన్న ప్రజాభిప్రాయసేకరణకు వచ్చిన వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై దాడి ఘటన నేపథ్యంలో సర్కారు అప్రమత్తమైంది. భారీ ఎత్తున పోలీసులను రంగంలోకి దింపింది. ఆ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది. అలాగే, ఇంటర్నెట్ సేవలను (Internet services)నిలిపివేసినట్లు తెలిసింది. మీడియాపై కూడా అంక్షలు విధించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో ప్రభుత్వం సోమవారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రణరంగంగా మారిన నేపథ్యంలో దీని వెనుక గల కారణాలపై దర్యాప్తు చేపడుతోంది.
దాడి కేసులో 52 మంది అరెస్ట్..
కలెక్టర్ ప్రతీక్‌జైన్, కడ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డిపై కొందరు రైతులు దాడి చేశారు. అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో నిన్న అర్థరాత్రి గ్రామాల్లో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అధికారులపై దాడి చేసినవారిలో ఇప్పటివరకు 52 మందిని గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా లగచర్ల, రోటిబండ, పులిచర్ల సహా 6 గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
…………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
