Dundigal Car Fire Death
* కారులో దహనం
* ఆర్థిక ఇబ్బందులే కారణమా?
ఆకేరు న్యూస్, హైదరాబాద్: కుటుంబ కలహాలు, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి తన కారులో పెట్రోలు పోసుకొని సజీవ దహనమైన విషాదకర ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బౌరంపేట పరిధిలోని ప్రణీత్, ప్రణవ్ మెడోస్ కాలనీకి చెందిన రాధాకృష్ణ (40) లాండ్రీ వ్యాపారం చేస్తూ తన తల్లి మంగళతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. అతనికి ఎనిమిదేళ్ల క్రితం వివాహం కాగా, ఒక కుమారుడు, కుమార్తె సంతానం ఉన్నారు. అయితే, గత రెండున్నర సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య తలెత్తిన కుటుంబ కలహాల కారణంగా భార్య పిల్లలతో కలిసి బోడుప్పల్లో వేరుగా ఉంటున్నారు.
* తీవ్రమైన ఒత్తిడితో..
కుటుంబానికి దూరమవడం, మరోవైపు ఆర్థిక సమస్యలు తీవ్రతరం కావడంతో రాధాకృష్ణ తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు నిత్యం మద్యం సేవించడం అలవాటు చేసుకున్నాడు. ఈ వ్యసనం కారణంగా అతను తాను చేస్తున్న పనిని కూడా సరిగా పట్టించుకోకపోవడంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. జీవితంపై విరక్తి చెందిన అతను ఈ తీవ్ర నిర్ణయానికి పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
* సర్వీస్ రోడ్డు పక్కన కారు నిలిపి..
బౌరంపేట ప్రాంతంలోని నిర్మాణాలు జరుగుతున్న రోడ్డు సమీపంలోని ఔట్ సర్వీస్ రోడ్డు పక్కన నిలిపి ఉంచిన TS 07 FS 1963 నంబరు గల కారు నుండి మంటలు రావడాన్ని అటుగా వెళ్తున్న స్థానికులు గమనించారు. వెంటనే అప్రమత్తమై దుండిగల్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, అప్పటికే కారులో ఉన్న రాధాకృష్ణ పూర్తిగా సజీవ దహనమైనట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
* విభిన్న కోణాల్లో దర్యాప్తు
ఈ ఘటనపై దుండిగల్ సీఐ బాల్రెడ్డి మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో పాటు వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. మృతుని తల్లి ఇచ్చిన సమాచారం ప్రకారం.. భార్య పిల్లలతో పెద్దగా వివాదాలు లేవని చెబుతున్నప్పటికీ, అన్ని కోణాల్లోనూ కేసును సమగ్రంగా విచారిస్తున్నామని వెల్లడించారు. మృతుడి కుటుంబసభ్యులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
