72 Feet Eco Friendly Ganesh Hyderabad
* తిరంగా యూత్ యువకుల సంకల్పం
* భారీ మట్టి గణపయ్య నిర్మాణానికి శ్రీకారం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ఎల్బీనగర్ నాగోల్ చౌరస్తా సమీపంలో ఈ ఏడాది గణేష ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన 72 అడుగుల మట్టి మహాగణపతి.. అష్ట సిద్ది మహాగణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. పర్యావరణ పరిరక్షణను కాంక్షిస్తూ ఏర్పాటు చేస్తున్న ఈ మహా విగ్రహం ప్రత్యేకతలతో పాటు ఉత్సవ నిర్వాహకుల రెండు దశాబ్దాల కృషి దీని వెనుక దాగుంది.
* 20 ఏళ్ల క్రితమే అంకురార్పణ
పర్యావరణ హితమైన ఇకో-ఫ్రెండ్లీ మట్టి ప్రతిమలను ప్రతిష్టించాలనే సత్సంకల్పం కొత్తపేట బాలాజీనగర్ కాలనీకి చెందిన తిరంగా యూత్ యువకుల్లో సుమారు 20 ఏళ్ల క్రితమే అంకురించింది. భక్తి మార్గంతో పాటు ప్రకృతిని పరిరక్షించడంలోనూ గణేష్ ఉత్సవాలు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో వీరు ఏనాడో ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు. నాటి నుంచి నేటి వరకు తమ ఆశయానికి కట్టుబడి ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు.
* శిల్పి నగేష్.. 21 మంది కార్మికులు
ఈ భారీ విగ్రహ రూపకల్పన బాధ్యతలను కొత్తపేటకు చెందిన ప్రముఖ శిల్పి నగేష్ తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో మొత్తం 21 మంది కార్మికులు గతేడాది జూన్ 17న కర్రపూజతో మండప నిర్మాణం, విగ్రహ తయారీ పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఎక్కడా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉపయోగించకుండా, సుమారు 60 రోజుల పాటు శ్రమించి ఈ అద్భుతమైన మట్టి మహా గణపతికి తుదిరూపు ఇస్తున్నారు. ప్రత్యేకంగా ఈ ప్రధాన విగ్రహంలోనే మరో ఏడు విలక్షణ గణేష మూర్తులు కూడా కొలువుదీరి భక్తులకు కనువిందు చేయనున్నాయి.
* విశేష కృషి
ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతం కావడానికి తిరంగా యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నపబోయిన సాయి ముదిరాజ్తో పాటు బడ్కా రమేష్, గుండుమల్ల ప్రవీణ్‌గౌడ్, వెంకటేష్, అఖిల్, మణిదీప్, అనంతుల ప్రణీత్‌రెడ్డి తదితరులు ముందుండి శ్రమిస్తున్నారు. విగ్రహ ఏర్పాటు మొదలుకుని ప్రతి దశలోనూ వీరంతా సమన్వయంతో వ్యవహరిస్తున్నారు.
* అక్కడే నిమజ్జనం
ఉత్సవాలు ముగిసిన తర్వాత ప్రతిమను ఎక్కడికైనా తరలించి నిమజ్జనం చేయడానికి బదులుగా, 11 రోజుల విశేష పూజల అనంతరం ఏ ప్రాంతంలో అయితే ప్రతిష్టించారో అక్కడే ఈ అష్ట సిద్ది మహాగణపతి నిమజ్జనం నిర్వహించడం మరో విశేషం.
* పెరట్లో మొక్కల పంపకానికి..
నిమజ్జనం పూర్తయిన తర్వాత ఆ పవిత్రమైన మట్టిని స్థానిక ప్రజలు తమ పెరట్లోని మొక్కలకు, మరికొందరు తమ పంట పొలాల్లోకి తీసుకెళ్లి వాడుకుంటారు. రసాయన రహితమైన ఈ మట్టి భూమిలో కలిసిపోవడమే కాకుండా మొక్కలకు ఎంతో మేలు చేస్తుంది. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తున్న ఈ ఇకో-ఫ్రెండ్లీ మట్టి మహాగణపతి ఏర్పాటు, భవిష్యత్తులో అందరికీ ఒక గొప్ప స్ఫూర్తిగా నిలవనుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
