Rahul Sipligunj Case
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :ప్రముఖ గాయకుడు, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో విశాఖపట్నంలో రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం తెలుగు సినీ, సంగీత వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. యువతి చేసిన ఆరోపణలపై పోలీసులు ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
* ఆరోపణలు నిజమని ఇప్పుడు నిర్ధారించలేం
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు సంబంధిత వ్యక్తులను విచారించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారం దర్యాప్తు దశలోనే ఉండటంతో ఆరోపణలు నిజమని నిర్ధారించలేమని, పోలీసుల దర్యాప్తులో వెలువడే వివరాల ఆధారంగానే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
* తెలుగు రాష్ట్రాల్లో ఇమేజ్
రాహుల్ సిప్లిగంజ్‌కు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది. గాయకుడిగా పలు సినిమాల్లో పాటలు పాడటంతో పాటు తన ప్రత్యేకమైన శైలితో అభిమానులను సంపాదించుకున్నారు. బిగ్‌బాస్ ద్వారా ఆయనకు మరింత పాపులారిటీ వచ్చింది. అలాంటి సమయంలో ఆయనపై కేసు నమోదైనట్లు వార్తలు రావడం అభిమానుల్లోనూ ఆసక్తిని కలిగిస్తోంది.
* వివాదం ఏమిటంటే..
విశాఖకు చెందిన ఓ యువతి .. కర్పూరపు రాహుల్ రెడ్డి అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా జోక్యం చేసుకున్నారన్నారు. రాహుల్ రెడ్డికి బంధువునని చెప్పి, తనను బెదిరించారని, బలవంతంగా కొన్ని వీడియో స్టేట్మెంట్లు ఇప్పించారని ఫిర్యాదులో తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
