Dr. Rajaiah Dalit Christians Discrimination
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
దళిత క్రైస్తవులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతున్నాయని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందూ మతంలో ఉంటేనే దళితులకు ఎస్సీ హోదా కల్పించే విధానం కొనసాగడం వివక్ష కాదా అని ప్రశ్నించారు. ఈ విషయంలో సిక్కులు, బౌద్ధులకు ఉన్న వెసులుబాటు దళిత క్రైస్తవులకు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించారు. బీసీ వర్గానికి చెందిన వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారినా వారి కుల గుర్తింపు మారకుండా ఉండే పరిస్థితి ఉంటే, కేవలం దళితుల విషయంలోనే ఈ వివక్ష ఎందుకని అన్నారు. జనగణన ప్రక్రియ ప్రారంభం కాకముందే పార్లమెంట్లో బిల్లు పెట్టి దళిత క్రైస్తవుల సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మాదిగలకు టికెట్లు ఇవ్వకుండా వివక్ష చూపుతోందని విమర్శించారు. గత ఎంపీ సీట్ల కేటాయింపులో కూడా రేవంత్ రెడ్డి మాదిగలపై వివక్ష చూపించారని ఆరోపించారు.
బీఆర్ఎస్ దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించకుండా సహకరించాలని కోరారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టిస్తున్నారని కడియం శ్రీహరిపై ఆరోపించారు. మున్సిపాలిటీ కమిషనర్ ఫ్లెక్సీలకు ఇచ్చిన అనుమతులను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. దేవాదుల ప్రాజెక్టుపై కడియం శ్రీహరికి సరైన అవగాహన లేదని దేవాదుల ద్వారా 38 టిఎంసిల నీటిని సరఫరా చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఆ అవకాశాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదని అన్నారు. ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ నేతలు తాటికొండ సురేష్ కుమార్, మాచర్ల గణేష్, కనకం గణేష్, రాజన్ బాబు, మారెపల్లి ప్రసాద్, కుంభం కుమార్, చిట్టిబాబు, బంగ్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
