Hyderabad Father Attacks Son
* పిల్లర్‌కు తలబాది, లారీ కిందకు నెట్టేసే యత్నం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగరం గుడిమల్కాపూర్ పరిధిలో తీవ్ర దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. పసివాడని కూడా చూడకుండా కన్నతండ్రే కాలయముడిగా మారి తన నాలుగేళ్ల కుమారుడిపై విచక్షణారహితంగా దాడికి ఒడిగట్టాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిమల్కాపూర్‌కు చెందిన సల్మాన్ అనే వ్యక్తి, తన నాలుగేళ్ల కుమారుడు అర్మాన్‌పై దారుణానికి పాల్పడ్డాడు. ఉన్మాదంతో రగిలిపోతూ బాలుడి తలను అక్కడే ఉన్న ఒక సిమెంట్ పిల్లర్‌కు కేసి గట్టిగా కొట్టాడు. అంతటితో ఆగకుండా, తీవ్రంగా గాయపడిన పసివాడిని రోడ్డుపై వెళ్తున్న లారీ కిందకు నెట్టేసేందుకు యత్నించాడు.
సల్మాన్ చేస్తున్న ఈ ఘోరాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, సమయస్ఫూర్తితో బాలుడు అర్మాన్‌ను రక్షించారు. నిందితుడి బారిన పడకుండా పసివాడిని కాపాడి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో, వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు అతనికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు సల్మాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అసలు తండ్రి తన కన్నకొడుకుపై ఇంతటి దారుణానికి ఎందుకు ఒడిగట్టాడనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
