Hyderabad Honey Trap Case
*ఓయో స్లిప్పులు, వీడియోలతో ప్రభుత్వ అధికారికి మూడేళ్లుగా నరకం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: భాగ్యనగరంలో మరో కేటుగత్తె గుట్టురట్టయింది. అందాన్ని ఎరగా వేసి, అమాయకులను వలగూడటంలో ఆరితేరిన ఓ కిలాడీ లేడీ ఉచ్చులో పడి ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి లక్షలాది రూపాయలు సమర్పించుకున్నాడు. ఓయో రూమ్ స్లిప్పులు, గుట్టుగా తీసిన ఫొటోలు, వీడియోలను చూపిస్తూ గత మూడేళ్లుగా సదరు అధికారిని బ్లాక్మెయిల్ చేస్తూ నరకం చూపించిందో కిలాడీ లేడీ. చివరికి ఆమె వేధింపులు భరించలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ హనీట్రాప్ వ్యవహారం కాస్తా వెలుగులోకి వచ్చింది.
*పోలీసుల కథనం ప్రకారం..
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ రేషన్ సర్కిల్ కార్యాలయంలో ఓ అధికారి విధులు నిర్వహిస్తున్నారు. మూడేళ్ల క్రితం సదరు అధికారికి ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని సదరు మహిళ అతడిని నయగారాలతో లొంగదీసుకుంది. అనంతరం ఇద్దరూ కలిసి ఓయో రూమ్స్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే, అక్కడే అసలు కథ మొదలైంది.
తామిద్దరూ కలిసి ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలు, రికార్డు చేసిన వీడియోలతో పాటు తాము బస చేసిన ఓయో రూమ్ స్లిప్పులను సదరు మహిళ అస్త్రంగా మార్చుకుంది. వాటిని చూపిస్తూ సదరు ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించడం ప్రారంభించింది. “నేను అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఈ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతాను.. నీ ఉద్యోగం తీయిస్తాను.. నీ కుటుంబ సభ్యులకు పంపిస్తాను” అంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడింది.
*మూడేళ్ల పాటు వసూళ్ల పర్వం…
సమాజంలో తన పరువు పోతుందనే భయంతో, ఉద్యోగానికి ముప్పు వస్తుందనే ఆందోళనతో ఆ అధికారి ఆమె అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ వచ్చాడు. అలా గత మూడేళ్లుగా సదరు కిలాడీ లేడీ అతని నుంచి భారీగానే వసూలు చేసినట్లు సమాచారం. అయితే, రోజురోజుకూ ఆమె డిమాండ్లు, బెదిరింపులు తారాస్థాయికి చేరుకోవడంతో బాధితుడు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు.
ఇక ఆమె వేధింపులను తట్టుకోలేక, పరువు పోయినా పర్వాలేదనుకుని చివరకు ధైర్యం చేసి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. నిందితురాలు తనను ఎలా ట్రాప్ చేసింది, ఫొటోలు, వీడియోలతో ఎలా బ్లాక్మెయిల్ చేస్తుందో వివరిస్తూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.
*రంగంలోకి దిగిన పోలీసులు…
బాధితుడి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన సదరు మహిళను అదుపులోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఆమె వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? ఈమె చేతిలో ఇంకెంతమంది ఇలా మోసపోయారు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానిక ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
