Ex-MLA Peddi Sudarshan Reddy Statue
* బిఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్
ఆకేరు న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో అర్ధరాత్రి వేళ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెడికల్ కాలేజీ సమీపంలో ఇటీవల ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని పోలీసులు, మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి వేళ తొలగించడం రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. అనుమతులు లేవనే నెపంతో అధికారులు ఈ చర్యకు పాల్పడటంతో బీఆర్ఎస్ శ్రేణులు, స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
* నల్లబెల్లిలో కన్నీటి పర్యంతమైన పెద్ది స్వప్న…
తన భర్త విగ్రహాన్ని అర్ధరాత్రి వేళ తొలగించారన్న వార్త తెలియగానే, నల్లబెల్లిలోని ఆయన స్వగృహం వద్ద తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న భర్త విగ్రహం వద్ద రోదిస్తూ అత్యంత భావోద్వేగానికి గురయ్యారు. “నువ్వు లేని రోజు చూడు.. ఎంత అరాచకమో” అంటూ ఆమె కన్నీటి పర్యంతమైన తీరు అక్కడ ఉన్న ప్రతీ ఒక్కరినీ కలచివేసింది.
* ఉమ్మడి వరంగల్లో బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టులు…
విగ్రహ తొలగింపును నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలకు దిగే అవకాశం ఉండటంతో పోలీసులు ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా భారీగా మోహరించారు. ముందస్తు చర్యగా మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, తెలంగాణ ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ సహా పలువురు ముఖ్య నాయకులను వారి నివాసాల్లో సుబేదారి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
* వినయ్ భాస్కర్ తీవ్ర విమర్శలు…
తనను గృహనిర్బంధం చేయడంపై వినయ్ భాస్కర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ దారుణానికి పాల్పడిందని విమర్శించారు. చనిపోయిన వ్యక్తులను, ఉద్యమకారులను కూడా వదిలిపెట్టకుండా రాక్షసానందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సంపేట వ్యాప్తంగా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భారీగా బలగాలను రంగంలోకి దించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
