Thorrur Police Constable Attack
* ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘటన
ఆకేరు న్యూస్, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండల కేంద్రంలో ఘోర ఉదంతం చోటు చేసుకుంది. భార్యాభర్తల వివాదాన్ని సర్దిచెప్పడానికి వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్‌పై ఒక వ్యక్తి కత్తితో దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తొర్రూర్ మండలానికి చెందిన గుగులోత్ కోటేశ్వర్, ఆయన భార్య చంద్రకళ మధ్య కుటుంబ తగాదాలు చోటు చేసుకున్నాయి. గొడవ తీవ్రం కావడంతో బాధితురాలు చంద్రకళ వెంటనే 112 అత్యవసర నంబర్‌కు ఫోన్ చేసి పోలీసుల సహాయం కోరింది. సమాచారం అందుకున్న వెంటనే బ్లూకోర్ట్ కానిస్టేబుల్ జాటోత్ రామచంద్రు స్పందించి బాధితురాలి ఇంటికి చేరుకున్నారు.
ఆ కానిస్టేబుల్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన కోటేశ్వర్, హఠాత్తుగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో కానిస్టేబుల్ రామచంద్రు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గ్రహించిన కానిస్టేబుల్ వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు.
* నిందితుడి అరెస్ట్..
కానిస్టేబుల్ నుంచి కాల్ రావడంతోనే తొర్రూర్ పోలీసులు వేగంగా స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన కానిస్టేబుల్ రామచంద్రుని స్థానిక ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన నిందితుడు కోటేశ్వర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
