Mahabubabad Murder Conspiracy
* వాట్సాప్ చాట్ చూసి భర్త షాక్
ఆకేరు న్యూస్, మహబూబాబాద్:
వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. కొరియర్ బాయ్తో ఏర్పడిన అక్రమ సంబంధం కోసం, కట్టుకున్న భర్తనే కడతేర్చడానికి ఒక భార్య వేసిన దారుణ ప్లాన్ ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

* బాధితుడి ఆవేదన…
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదే రాజేశ్వరరావుకు, సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన భవానితో 2016లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రాజేశ్వరరావు ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఈ క్రమంలో భవానికి, ఆసుపత్రి ప్రాంతంలో పనిచేసే సైదులు అనే కొరియర్ బాయ్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. గత నెల 27న రాజేశ్వరరావు మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి రాగా, భార్య భవాని వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని గమనించాడు. దీంతో వారిద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధం బయటపడింది.

* పెద్దల పంచాయితీ.. వెంబడించిన ప్రియుడు..
ఈ విషయమై గత నెల 28న చిలుకోడు గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో పక్క ఊరిలో ఉన్న తన అన్నను తీసుకురావడానికి రాజేశ్వరరావు వెళ్తుండగా, భవాని ప్రియుడు సైదులు అతడిని బైక్పై వెంబడించాడు. అప్రమత్తమైన రాజేశ్వరరావు అతని నుండి ఎలాగోలా తప్పించుకుని తిరిగి ఇంటికి చేరుకున్నాడు.

* చాటింగ్లో బయటపడ్డ ప్లాన్..
అనుమానంతో భార్య భవాని మొబైల్ ఫోన్ చెక్ చేయగా రాజేశ్వరరావుకు దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లలో ప్రియుడు సైదులుతో భవాని చేసిన చాటింగ్ చూసి అతను షాక్కు గురయ్యాడు. “నా భర్తను ఎలాగైనా చంపేయ్.. ఇంట్లో చంపితే అనుమానం వస్తుంది, బయట ఎవరితోనైనా యాక్సిడెంట్ చేయించి కడతేర్చు. నువ్వు ఇది చేయకపోతే నేను చనిపోతాను” అంటూ భవాని ప్రియుడికి వరుసగా మెసేజ్లు పంపినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.
* పోలీసుల చుట్టూ తిరుగుతున్న భర్త..
తన భార్య, ఆమె ప్రియుడి నుంచి ప్రాణహాని ఉందని గ్రహించిన రాజేశ్వరరావు, ఆ చాటింగ్ స్క్రీన్షాట్లను ఆధారాలుగా తీసుకుని ఈ నెల 1న డోర్నకల్లు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వారు జీరో ఎఫ్ఐఆర్ (Zero FIR) నమోదు చేసి, కేసును ఘటన జరిగిన పరిధిలోని ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు.
అయితే, జీరో ఎఫ్ఐఆర్ బదిలీ అయి రోజులు గడుస్తున్నా పోలీసులు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో, తీవ్ర భయాందోళనకు గురైన రాజేశ్వరరావు గురువారం ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో మరోసారి ఫిర్యాదు చేశాడు. బాధితుడి నుంచి ఫిర్యాదు అందిందని, దీనిపై సమగ్ర విచారణ జరిపి కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఖమ్మం రూరల్ సీఐ తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
