
* గంజాయి, నకిలీ విత్తనాలపై ముందస్తు సమాచారం ఇచ్చిన వారికి పది వేల రూపాయల బహుమతి
* ములుగు జిల్లా ఎస్పీ శభరీష్
ఆకేరున్యూస్, ములుగు: ములుగు జిల్లా పరిధిలోని జాకారం గ్రామంలో మంగళవారం జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ప్రజల భద్రత మరియు భరోసా కొరకు ‘‘అభయ మిత్ర ‘‘ అనే కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రతకి రక్షణ కల్పించే చట్టాలు, సమాజంలో జరుగుతున్న నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించి తద్వార నేర రహిత సమాజాన్ని నిర్మించడం పోలీసులకు , ప్రజల మధ్య సత్సంబంధాలు పెంపొందించేలా చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని ఎస్పీ వివరించారు. నిషేధిత మాదక ద్రవ్యాల వ్యతిరేక చట్టంపై అవగాహన కల్పిస్తూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటికి అలవాటు పడి తమ జీవితాన్ని నాశనం చేసుకోకూడదని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలని వారి అలవాట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని ఒక వేళ వారి పిల్లలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన నేపథ్యంలో తమకు వెంటనే సమాచారం తెలియజేయాలనీ, తద్వారా వారిని రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలించి వారికి కౌన్సిలింగ్ ఇప్పించడం ద్వారా వారిని మాదక ద్రవ్యాల భారీ నుండి దూరం చేయడం జరుగుతుంది అని అన్నారు. ములుగు మండలంలోని 32 గ్రామాలలో యాంటీ డ్రగ్ కమిటీ లను ఐదు నెలల క్రింద ఏర్పాటు చేయడం జరిగిందన్నారు .ఈ సందర్భంగా యాంటీ డ్రగ్స్ కమిటీ సభ్యులు గ్రామాలలో అక్రమంగా ఎవరైనా గంజాయి వంటి మత్తు మాదక ద్రవ్యాలను సరఫరా చేసినా, ఉపయోగించిన, విక్రయించినా అటువంటి వారి గురించిన సమాచారాన్ని వెంటనే పోలీసులకు తెలియజేయాలన్నారు.
పొలాల చుట్టూ కరెంట్ పెన్సింగ్ ఏర్పాటు చేయొద్దు..
గ్రామస్తులు మరియు రైతులు అడివి జంతువుల బారి తమ పంట పొలాల రక్షణకై పొలాల చుట్టూ అక్రమంగా కరెంట్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం వలన అమూల్యమైన ప్రజల ప్రాణాలు పోతున్నాయని, కాబట్టి ఎవరు కూడా పంట పొలాల చుట్టూ కరెంట్ పెన్సింగ్ ఏర్పాటు చేయవద్దని తెలియజేసినారు. కరెంట్ ఏర్పాటు చేసేవారి పై చట్ట రీత్యా కఠినచర్యలు తీసుకుంటామని అన్నారు.
యువతకు పొక్సో చట్టంపై అవగాహన ఉండాలి..
అదే విధంగా పోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తూ, యువతను ఉద్దేశించి యువతకి ఫోక్సొ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, 18 సంవత్సరాలు నిండని మైనర్ బాలికలతో ప్రేమ వ్యవహారాలు చేసిన, ఒక మైనర్ బాలిక తన ఇష్టానుసారం శారీరిక సంబంధం పెట్టుకున్న, అట్టి విషయాల లో బాలికల అంగీకారం, అనుమతి ఉన్నప్పటికీ అది చట్ట పరంగా నేరం కాబట్టి, తద్వారా సదరు యువకులు చట్టరీత్యా నేరస్థులుగా పరిగణించబడతారని వివరించారు పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. వృద్ధాప్యంలోని తమ తల్లిదండ్రుల పరిరక్షణపై వారి పిల్లలు శ్రద్ధ కలిగి ఉండాలని సూచించారు. తల్లిదండ్రుల ద్వారా ఆస్తిపాస్తులు పొందిన తర్వాత వారి పరిరక్షణ పట్టించుకోకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తే తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం గా ప్రవర్తించే వారసుల నుండి వారి ఆస్తిని తిరిగి తల్లిదండ్రుల పేరు మీదకు మార్చడం జరుగుతుందని తెలిపారు. చట్ట ప్రకారం వారి మీద చర్యలు తీసుకోబడుతాయని తెలియచేశారు.
సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి..
ప్రజలు సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ రోజుల్లో దాదాపు ప్రతి కుటుంబం స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్నారని, అందరూ యూపీఐ ద్వారా లావాదేవీలు కొనసాగిస్తున్నారని, సైబర్ నేరగాళ్లు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలను మోసం చేసేందుకు ఆస్కారం ఉందని, అందువలన ప్రజలు సైబర్ క్రైమ్ నేరస్తుల బారిన పడకుండా సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. సైబర్ నేరాలకు గురైన బాధితులు వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని తద్వారా తాము కోల్పోయిన డబ్బును తిరిగి పొందడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు.
లోన్ అప్లికేషన్ ద్వారా లోన్లు తీసుకోవద్దు..
ప్రజలు సామాజిక మాధ్యమాలలో కనిపించే లోన్ అప్లికేషన్ ద్వారా లోన్లు తీసుకోవద్దని హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా కాల్ చేసి లోన్ ఇస్తామని చెప్తే నమ్మి మోసపోవద్దని, మీ వ్యక్తిగత వివరాలను ఎవరికి చెప్పకుండా తగిన భద్రత పరంగా మీరు ఖాతా కలిగి యున్న బ్యాంకులను సంప్రదించాలని తెలిపారు. ఈ మధ్య కొంత మంది యువకులు క్రికెట్ బెట్టింగ్ బారిన పడి ఆత్మ హత్యలు చేసుకుంటున్నారని, కాబట్టి యువత బెట్టింగ్ మరియు జూదం వంటి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. బెట్టింగ్ లలో పాల్గొనడం ద్వారా వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు చిన్నభిన్నం అవుతాయని, బెట్టింగ్, జూదం వంటి వాటి బారిన పడకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. ఎవరైనా జూదం నిర్వహించిన బెట్టింగ్ లు నిర్వహించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు.
నకిలీ విత్తనాల గురించి అవగాహన కలిగి ఉండాలి..
రైతులు నకిలీ విత్తనాల గురించి అవగాహన కలిగి ఉండాలని అన్నారు, గ్రామం లో ఎవరైనా అధిక దిగుబడి వస్తది అని ఆశ చూపి ఎటువంటి లైసెన్స్ లేకుండా విత్తనాలను విక్రయించే వారి వద్ద కొనుగోలు చేయవద్దని, కేవలం లైసెన్స్ కలిగి ఉన్న డీలర్స్ నుండి మాత్రమే విత్తనాలను ఖరీదు చేయాలని సూచించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు మరియు ఎటువంటి అనుమతులు లేకుండా విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందిచాలని అన్నారు.ప్రస్తుతం వర్షాకాలమైనందున లోతట్టు గ్రామాల లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధిక వర్షపాతం ఉన్న సమయాలలో రహదారులు, వంతెనలు, కల్వర్ట్ లు వరద ముంపుకు గురైనప్పుడు ఎవరు కూడా తమ వాహనాలతో దాటే ప్రయత్నం చేసి అమూల్యమైన ప్రాణులను పొగట్టుకోవద్దని వరద ముంపుకు గురైన రహదారుల, వంతెనలు, కల్వర్ట్లవద్ద పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేస్తామని పోలీసులు ప్రజలకి సహకరించాలని సూచించారు. వరదల వల్ల ఏ ఒక్క ప్రాణం పోకూడదని అందుకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ములుగు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు తమ గ్రామ పంచాయతీ పరిధిలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. తద్వారా ఆయా గ్రామాలలో ఎటువంటి అసాంఘిక కార్య కలాపాలు జరగకుండా నిరోధించడం సులువుఅవుతుందని, దొంగతనాలు, దోపిడీలు వంటి నేరాలు జరగకుండా నిరోధించడం వీలవుతుందని తెలియజేసారు. జిల్లాలోని అన్ని గ్రామాలలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ములుగు మండలంలోని 32 గ్రామ పంచాయతీలలో సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ రోడ్ సేఫ్టీ కమిటీల ద్వారా రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు బాధ్యతగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలని అన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారి పై చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని తెలియచేశారు. ప్రజలు తమ గ్రామాల పరిధిలో జరిగే రోడ్డు ప్రమాదాలపై వెంటనే స్పందించి పోలీస్ లకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు డిఎస్పి గారు, ములుగు సిఐ గారు, ములుగు ఎస్ఐ గారు మరియు వారి విలేజ్ పోలీస్ ఆఫీసర్స్, ములుగు మండలంలోని అన్ని గ్రామాలలో యాంటీ డ్రగ్ కమిటీలలో పనిచేస్తున్న సభ్యులు, మరియు జాకారం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
………………………………………….