Collector Chahat Bajpai parkal area 100 beds hospital
* నూతన ఏరియా ఆసుపత్రిని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి
– పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి
* ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సమీక్ష
* ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే ప్రధాన లక్ష్యం
అకేరు న్యూస్, పరకాల: హనుమకొండ జిల్లా పరకాలలో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని అత్యాధునిక వైద్య పరికరాలు, మెరుగైన మౌలిక వసతులతో త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
గురువారం పరకాలలో నూతనంగా నిర్మిస్తున్న ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అధ్యక్షతన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్ పర్సన్ , హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, ఆర్డీవో డి.ఎస్. వెంకన్న, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గౌతమ్ చౌహాన్, మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఆరోగ్యశ్రీ నిధుల ద్వారా రూ.79.18 లక్షల వ్యయంతో వైద్య పరికరాల కొనుగోలు, అత్యవసర మందుల నిల్వలు, శస్త్రచికిత్సలకు అవసరమైన పరికరాలు, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై అధికారులు, కమిటీ సభ్యులతో చర్చించారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల సంఖ్య, ప్రతిరోజూ వైద్య సేవల కోసం వచ్చే రోగుల వివరాలు, నెలవారీ ప్రసవాలు, శస్త్రచికిత్సల సంఖ్య, మందుల నిల్వలు, నూతన ఆసుపత్రికి అవసరమైన అదనపు పరికరాలు, అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్ల గణాంకాలు, ఆసుపత్రి పరిధిలోని మండలాల వివరాలను ఎమ్మెల్యే సూపరింటెండెంట్‌ను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన బిల్లులు, రికార్డులను పరిశీలించారు. బిల్లులు, రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడంపై సూపరింటెండెంట్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పరకాల ఏరియా ఆసుపత్రి ద్వారా ప్రజలకు 24 గంటల పాటు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్నారు. వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ముఖ్యంగా అనస్థీషియా వైద్యుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన అన్ని మందులు ఆసుపత్రిలో నిల్వ ఉంచాలని ఆదేశించారు.
గత నెలలో నూతన ఏరియా ఆసుపత్రిని సందర్శించి, అవసరమైన వైద్య పరికరాలు, మౌలిక వసతులు, అభివృద్ధి పనుల వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన ప్రతి రశీదు, బిల్లు, రికార్డును పారదర్శకంగా, సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అభివృద్ధి పనులను సంబంధిత ఏజెన్సీలు వేగవంతంగా పూర్తి చేసి ఆసుపత్రిని త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.
అదేవిధంగా పరకాలలో అసంపూర్తిగా ఉన్న మార్కెట్ భవన సముదాయం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్‌కు ఎమ్మెల్యే సూచించారు.
జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణుల సంఖ్య, శస్త్రచికిత్సలు, ప్రసవాల గణాంకాలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఆసుపత్రి నిర్వహణ, సేవల నాణ్యతను మరింత మెరుగుపర్చాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ బాలకృష్ణ, నాగరాణి, రాఘవరెడ్డి, పుష్పలత, టీజీఎంఐడీసీ ఈఈ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
