ACB Raids on DSP Bhim Reddy
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
తెలంగాణలో అవినీతి తిమింగలాల వేటలో అవినీతి నిరోధక శాఖ (ACB) మరోసారి భారీ సోదాలతో విరుచుకుపడింది. ఈసారి ఏకంగా పోలీస్ శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ఏసీబీ వలలో చిక్కడం తీవ్ర కలకలం రేపుతోంది. తెలంగాణ డీజీపీ కార్యాలయంలోని కంప్యూటర్స్ విభాగంలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఎస్. భీమ్ రెడ్డి నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచే ఏకకాలంలో దాడులు ప్రారంభించారు.
* 20 చోట్ల ఏకకాలంలో సోదాలు..
డీఎస్పీ భీమ్ రెడ్డి ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నారనే నమ్మదగిన సమాచారం, ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ రంగంలోకి దిగింది. ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ ఖాన్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌లోని భీమ్ రెడ్డి ప్రధాన నివాసంతో పాటు తెలంగాణవ్యాప్తంగా ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన దాదాపు 20 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టాయి.
* రూ. 8 కోట్ల విల్లా.. కిలోల కొద్దీ బంగారం, వెండి బిందెలు…
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం.. డీఎస్పీ భీమ్ రెడ్డి హైదరాబాద్‌లో సుమారు రూ. 8 కోట్ల విలువైన అత్యంత విలాసవంతమైన లగ్జరీ విల్లాలో నివసిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సోదాల్లో భాగంగా ఆయన ఇళ్ల నుంచి భారీగా అక్రమ ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున బంగారు, వెండి ఆభరణాలతో పాటు వెండి బిందెలు, భారీగా నగదు, విదేశీ మద్యం బాటిళ్లు లభ్యమైనట్లు తెలుస్తోంది.
గతంలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో కీలక బాధ్యతలు నిర్వహించిన భీమ్ రెడ్డి.. భారీగా స్థిరాస్తులు, ల్యాండ్ డాక్యుమెంట్లు కూడబెట్టినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతుండటంతో ఆయన అక్రమాస్తుల విలువ మరిన్ని కోట్ల రూపాయల్లో తేలే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనా పోలీస్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
