
* జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
ఆకేరున్యూస్, జనగామ : ప్రజావాణిలో వచ్చిన సకల సమస్యల దరఖాస్తు లను సత్వరమే పరిష్కరించాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పురస్కరించుకొని అదనపు కలెక్టర్ లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్ లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వివిధ సమస్య లపై ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రీవెన్స్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. పెండిరగ్ లేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు దరఖాస్తుల పైన క్షేత్ర స్థాయి విచారణ చేసి సమస్య లను పరిష్కారించి, సంబంధిత దరఖాస్తుదారులకి సమాచారం అందించాలన్నారు. గ్రీవెన్స్ కార్యక్రమంలో వివిధ సమస్యలపైన కలెక్టర్ ప్రజల నుండి 56 దరఖాస్తు లను స్వీకరించారు ప్రజావాణి కార్యక్రమం అనంతరం వివిధ శాఖలకి చెందిన అధికారులతో పలు అంశాల పైన కలెక్టర్ రివ్యూ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల గురించి మాట్లాడుతూ మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారులు త్వరగా నిర్మాణం చేపట్టేలా మండల స్పెషల్ అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రొసీడిరగ్స్ తీసుకున్న వారి జాబితాను ప్రతీ ఎంపీడీఓ కార్యాలయం లో ప్రదర్శించాలన్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యాయని మండల స్పెషల్ అధికారులు ఎప్పటికప్పుడు పాఠశాలలను విజిట్ చేస్తూ మధ్యాహ్న భోజన తయారీ ని పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమన్ నాయక్,జనగామ, స్టేషన్ ఘన్పూర్ ఆర్డీవోలు గోపి రామ్, డిఎస్ వెంకన్న, డిఆర్డిఓ వసంత, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
ఇల్లు మంజూరు చేయండి..
జనగామ జిల్లా కేంద్రం నుండి 13వ వార్డుకు చెందిన చెరుకు ప్రమీల దరఖాస్తు అందిస్తూ.. తన కొడుకు శ్రీకాంత్ దివ్యాంగుడని, తాము పురాతనమైన కురుస్తున్న పెంకుటింట్లో జీవనం గడుపుతున్నామని తముకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
బాట కల్పించండి…
పాలకుర్తి మండలం ముత్తారం గ్రామానికి చెందిన రైతులు పొరల కృష్ణ, కర్రె రవీందర్, బామండ్ల పెద్దాపురం రైతులు విజ్ఞాపన అందిస్తూ కోమటి చెరువు, బ్రాహ్మణ కుంట చెరువు శిఖంలో బోర్లు వేసి వ్యవసాయం సేద్యం చేస్తు పట్టా భూములకు దారి లేకుండా చేశారని, వ్యవసాయం సీజన్ మొదలైనందున తాము పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.
జీవనోపాధి కావాలి
పాలకుర్తి కి చెందిన ఈ. నాగరాజు తాను దివ్యాంగుడునని, ఉన్నత విద్యలు అభ్యసించానని, తనకు జీవనోపాధి కల్పించాలని విజ్ఞప్తి అందించారు.
కబ్జా నుంచి రక్షించండి..
చిల్పూర్ మండలం మల్కాపూర్‌కు చెందిన గంకిడి వీరారెడ్డీ తాను అంధుడినని హైదరాబాదులోని జీఎస్టీ కార్యాలయంలో పనిచేస్తానని, తనవంతు వాటాకు వచ్చిన 1ఎకరం 10 గుంటలతో పాటు ఇంటి స్థలం కూడా తన అన్న, వదినలు అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
………………………………………………………