Alwal
* భర్తను హత్య చేసిన భార్య, కుమారుడు
Alwal| ఆకేరు న్యూస్, హైదరాబాద్: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య తన కుమారుడితో కలిసి భర్తను గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ (52), రమాదేవి (47) దంపతులు. వీరికి కుమారుడు నిఖిల్ (24), కుమార్తె నిఖిత (21) ఉన్నారు. శ్రీనివాస్ బాలానగర్‌లో నట్స్ అండ్ బోల్ట్స్ కంపెనీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆర్థిక సమస్యలతో తరచూ గొడవలు
శ్రీనివాస్‌కు కొంతకాలంగా మద్యం అలవాటు ఉండటంతో పాటు షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోయినట్లు సమాచారం. దీంతో కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. గతంలో రమాదేవి తన భర్తపై వరకట్న వేధింపుల కేసు కూడా నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
నిద్రిస్తున్న సమయంలో దాడి
కొద్ది రోజుల క్రితం కుటుంబం మచ్చబొల్లారం గోపాల్‌నగర్‌లోని పెద్ది ఫార్మరెడ్డి కాలనీకి మకాం మార్చింది. ఆదివారం రాత్రి కూడా భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. అనంతరం శ్రీనివాస్ బెడ్రూమ్లో నిద్రిస్తుండగా.. రమాదేవి తన కుమారుడు నిఖిల్ సహాయంతో గొడ్డలితో ఆయనపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర రక్తస్రావం కావడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు.
పోలీసులకు లొంగిపోయిన తల్లీకుమారుడు
హత్య అనంతరం రమాదేవి, నిఖిల్ నేరుగా అల్వాల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి తండ్రి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
