* ఈ ఎన్నికలు రాహుల్ పిల్ల చేష్టలకు, మోదీకి మధ్యే..
* తెలంగాణలో ఏ,బీ,సీ రాజకీయాలు నడుస్తున్నాయి
* కాంగ్రెస్ అబద్దపు ప్రచారాలు చేస్తోంది
* తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం
* బీజేపీకి డబుల్ డిజిట్ పక్కా
* ఇక్కడ 10 సీట్లు వస్తే.. కేంద్రంలో 400 సీట్లు వచ్చినట్లే
* భువనగిరి ప్రచార సభలో కేంద్ర మంత్రి అమిత్ షా
ఆకేరు న్యూస్, భువనగిరి : భువనగిరి లోక్‌సభ బరిలో రాహుల్ గాంధీ చెంచాకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చారని, అతని కాళ్లు పట్టుకుని మరీ పోటీలో నిలబెట్టారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. 2024 ఎన్నికలు రాహుల్ పిల్ల చేష్టల గ్యారెంటీలకు, మోదీ గ్యారెంటీలకని, ఒక కుటుంబ అభివృద్ధికి, దేశ అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరాటం అని చెప్పారు. ఓట్ ఫర్ జిహాద్‌కు, ఓట్ ఫర్ అభివృద్ధికీ అని అభివర్ణించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌కు మద్దతుగా భువనగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో గురువారం మధ్యాహ్నం అమిత్ షా ప్రసంగించారు. ఇప్పటి వరకు జరిగిన మూడు దశల ఎన్నికల్లో 200 సీట్లకు చేరవయ్యామని, ఇంకా 400 సీట్లకు రావాల్సి ఉందని, అందుకు తెలంగాణ తోడ్పాడాలని కోరారు. మోదీ మూడోసారి ప్రధాని కావాలా, వద్దా.. అని సభకు హాజరైన ప్రజలను ప్రశ్నించారు. మరోసారి మోదీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ అబద్దపు ప్రచారాలు చేస్తోందని, పదేళ్లు పూర్తి మెజారిటీలో ఆయన పాలన సాగించారని, రిజర్వేషన్లు తీయలేదని వెల్లడించారు.
రేవంత్ విను.. తెలంగాణలో 10 కన్నా ఎక్కువే..
2019 ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు తమకు 4 సీట్లు ఇచ్చారని, రేవంత్ వినూ.. ఈసారి 10 కన్నా ఎక్కువ సీట్లు గెలవబోతున్నామని, డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ 10 సీట్లు వస్తే.. కేంద్రంలో 400 సీట్లు వచ్చినట్లే అని వివరించారు. తెలంగాణ ఎన్నికల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 15000 రైతు భరోసా ఇస్తామని రాహుల్ గాంధీ వాగ్దానాలు చేశారని, నెరవేర్చలేకపోయారని తెలిపారు. కాలేజీలకు వెళ్లే యువతులకు స్కూటీలు ఇస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు.
ఏ అంటే అసదుద్దీన్.. బీ అంటే బీఆర్ఎస్.. సీ అంటే కాంగ్రెస్..
కాంగ్రెస్, బీఆర్ఎస్, ఓవైపీ పార్టీ మూడూ ఒక్కటే అని చెప్పారు. ఒవైసీని కాంగ్రెస్, బీఆర్ఎస్ లు నిలువరించలేవని తెలిపారు. తెలంగాణలో ఏబీసీ పాలన నడుస్తోందని, ఏ అంటే అసదుద్దీన్, బీ అంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్ అని వివరించారు. మూడు పార్టీలూ ఒక్కటే అని, వేర్వేరు కాదని విమర్శించారు. కాంగ్రెస్, మజ్లిస్, బీఆర్ఎస్.. బుజ్జగింపు రాజకీయాలు త్రికోణం లాంటివని తెలిపారు. ట్రిపుల్ తలాక్‌ను మళ్లీ తీసుకురావాలని చూస్తున్నారని అన్నారు. వారెవరూ రామ మందిర ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొనలేదని గుర్తు చేశారు. కశ్మీర్ కోసం అవసరమైతే భువనగిరి యువకులు ప్రాణాలు ఇస్తారన్నారు.
దేశమంతా మోదీ నినాదం
మోదీ.. మోదీ.. అంటూ దేశమంతా అదే నినాదం మార్మోగుతుందని, భువనగిరిలోనూ బూర్స నర్సయ్యకు ఓటేసీ మోదీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు. మోదీ చెప్పారంటే చేసి చూపుతారని, రామ మందిర నిర్మాణం విషయంలో 70 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అయోధ్య అంశాన్ని సాగదీసిందని, మోదీ ఐదేళ్లలో భూమి పూజ, రామ పూజ చేసి జై శ్రీరామ్ నినాదాలను మోగించారని తెలిపారు. కశ్మీర్ మనదా, కాదా అని అన్నారు. ఆర్టికల్ 370 తొలగించడం ద్వారా కశ్మీర్ లో త్రివర్ణపతాకం రెపరెపలాడేలా చేశారని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని సమాప్తం చేశారని, దేశాన్ని సురక్షితంగా ఉంచారని తెలిపారు. భువనగిరి ఎయిమ్స్, జనగామ రైల్వే ఆధునీకరణ పనులను మోదీనే చేపట్టారని తెలిపారు.
తెలంగాణను నంబర్ వన్ చేస్తాం..
నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో పరిపాలన చేసిన కేసీఆర్.. తన కుటుంబాన్ని మాత్రమే బాగు చేసుకున్నారని, ఐదేళ్లు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని, ఆ పార్టీ తెలంగాణను ఏటీఎంలా మార్చుకుందని, నరేంద్ర మోదీకి ఒక్క అవకాశం ఇస్తే.., తెలంగాణను నంబర్ వన్ గా మారుస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు.
——————————-