* పెంపుడు తల్లి అమానుషం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అమ్మగా చూసుకుంటానని.. చిన్నప్పుడే తీసుకొచ్చి పెంచిన 14 ఏళ్ల బాలికతో వ్యభిచారం చేయిస్తున్న అమానుష ఘటన హైదరాబాద్ కృష్ణానగర్లో వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆ బాలికకు విముక్తి కల్పించారు. తాను ఒప్పుకోకపోతే.., కొట్టేదని, తాళ్లతో కట్టేసి వ్యభిచారం చేయించేదని బాధితురాలు కన్నీరుమున్నీరవుతూ వాపోయింది. కృష్ణనగర్లో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంపై పశ్చిమ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఇద్దరు యువతులు, విటులు, వ్యభిచార గృహ నిర్వాహకురాలిని అరెస్టు చేశారు. అక్కడే ఉన్న ఓ బాలిక(14)ను శిశు సంరక్షణాధికారులకు అప్పగించారు. ఆ బాలిక వ్యభిచార గృహంలోకి ఎలా వచ్చిందని శిశు సంక్షేమ అధికారులు దృష్టి సారించగా గగుర్పాటు కలిగించే విషయాలు వెలుగుచూశాయి. వ్యభిచార గృహ నిర్వాహకురాలే తనని చిన్న వయసులో తీసుకువచ్చి పెంచుకుందని, తాను పుష్పవతి అవ్వగానే బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నదని బాధిత బాలిక వారికి తెలిపింది. ఆమెకు ఎదురుచెబితే దారుణంగా హింసించేదని వాపోయింది. రెండు నెలల క్రితం పెంపుడు తల్లి తనకు గుండు గీయించి ఇల్లు వదిలి వెళ్లకుండా చేసిందంటూ తనకు జరిగిన అన్యాయం చెబుతూ బాధిత బాలిక కంటతడి పెట్టుకుంది. ఈ సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు బాధిత బాలికను వెంటనే భరోసా కేంద్రానికి తరలించారు. కాగా, వ్యభిచార గృహ నిర్వాహకురాలితో పాటు మరికొందరిపై అత్యాచారం, బలవంతంగా వ్యభిచారంలోకి దింపడం వంటి కారణాలతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
—————————–