Facebook Banking Scam
* పెన్షన్ ఖాతాలోని రూ.3.71 లక్షల సొమ్ము మాయం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో కనిపించిన ఓ ప్రకటన ఓ రిటైర్డ్ ఉద్యోగికి నష్టాన్ని చేకూర్చింది. ఓ ప్రముఖ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ వ్యోమ్ అప్డేట్ పేరుతో కనిపించిన ఆ ప్రకటన ప్రకారం చేయడంతో నకిలీ ఏపీకే ఫైల్ మొబైల్లో డౌన్లోడ్ అయింది. సైబర్ నేరగాళ్లు దాని ద్వారా ఫోన్ తమ అధీనంలోకి తీసుకుని బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ నంబర్, పిన్ తదితర సమాచారాన్ని సేకరించి పింఛను ఖాతాలోని సొమ్ము కాజేశారు.
* ఆ ప్రకటన నిజమని నమ్మి..
బ్యాంకింగ్ యాప్‌ను అప్డేట్ చేయాలంటూ ఫేస్బుక్లో వచ్చిన ప్రకటనను నమ్మిన 82 ఏళ్ల రిటైర్డ్ రైల్వే ఉద్యోగి సైబర్ నేరగాళ్ల బారినపడి రూ.3.71 లక్షలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాపూర్‌కు చెందిన 82 ఏళ్ల రిటైర్డు రైల్వే ఉద్యోగి ఫేస్బుక్ ఖాతాను వినియోగిస్తున్నారు. ఆగస్టు 4న ఫేస్బుక్లో యూనియన్ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ అప్డేట్ చేయాలంటూ ఓ ప్రకటన కనిపించింది. అది నిజమైన బ్యాంకు ప్రకటనగా భావించిన ఆయన దానిపై క్లిక్ చేశారు.
* బ్యాంకు ఉద్యోగిగా లైన్లోకి..
ఆయన ప్రకటనపై క్లిక్ చేయగానే ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను యూనియన్ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగినని పరిచయం చేసుకున్నాడు. బ్యాంకింగ్ యాప్ అప్డేట్ చేయాల్సి ఉందని చెప్పిన నిందితుడు.. వాట్సాప్ వీడియో కాల్ ద్వారా బాధితుడికి ప్రక్రియను వివరించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం యూనియన్ వ్యోమ్ ఈజ్ అప్డేట్ 10ఏపీకే పేరుతో ఒక ఏపీకే ఫైల్‌ను పంపించి దాన్ని ఇన్స్టాల్ చేయాలని సూచించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్ నంబర్, పిన్ తదితర సమాచారాన్ని అందులో నమోదు చేయాలని చెప్పినట్లు బాధితుడు పోలీసులకు తెలిపారు. వివరాలు నమోదు చేసిన తర్వాత సర్వర్‌లో సమాచారం అప్డేట్ కావడానికి రెండు నుంచి మూడు గంటలు పడుతుందని చెప్పి కాల్ కట్ చేశారు. నిందితుల మాటలను నమ్మిన బాధితుడు ఆ ప్రక్రియను పూర్తి చేశారు.
* మర్నాడు ఖాతా పరిశీలిస్తే..
ఆ రిటైర్డ్ ఉద్యోగి ఆగస్టు 5న ఉదయం తన బ్యాంకు ఖాతా లావాదేవీలను పరిశీలించారు. ఖాతా నుంచి మొత్తం రూ.3,71,419 డెబిట్ అయినట్లు గుర్తించారు. తన పెన్షన్ సొమ్ము పోయిందని తెలుసుకున్న వృద్ధుడు లబోదిబోమంటూ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. తనకు జరిగిన మోసం గురించి వివరించారు. వివరాలన్నీ రాసి, తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
