Man Found Burning in Garbage Heap Dies Before Police Arrive
* పోలీసులు వచ్చేలోపు మృతి
*దోమలగూడలో కలకలం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
హైదరాబాద్‌లోని దోమలగూడలో కలకలం రేగింది. ఓ వ్యక్తి చెత్తకుప్పలో కాలుతూ ఉండడాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అపస్మారకస్థితిలో ఉన్న ఆయనను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి అతడు మృతి చెంది ఉన్నాడు. దోమల్‌గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. దోమల్‌గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోశాల సమీపంలో, కవాడిగూడ ప్రాంతంలో ఒక గుర్తుతెలియని వ్యక్తి చెత్తకుప్పలో కాలిపోతున్నట్లు స్థానికులు ఈరోజు ఉదయం గమనించారు.
అప్పటికే ఆ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండటంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
* హత్యా.. ఆత్మహత్యా..
పోలీసులు ఆ వ్యక్తిని గుర్తుపట్టడానికి ప్రయత్నించినా వివరాలు తెలియలేదు. మృతదేహాన్ని గుర్తించేందుకు స్థానికుల సహాయం కోరుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనా స్థలంలో ఎలాంటి గుర్తింపు కార్డులు లభించకపోవడంతో మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు ముమ్మరం చేశారు. అతడు ఎవరు? ఆత్మహత్యా? లేక హత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిత్యం జనసంచారం ఉండే ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. కాలుతున్న సమయంలో ఆయన అరుపులను ఎవరూ గమనించకపోవడం గమనార్హం.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
