Myanmar Airstrike Rakhine
* 49 మంది పౌరులు మృతి
* మార్కెట్‌పై బాంబుల వర్షం
ఆకేరు న్యూస్, డెస్క్ : మయన్మార్ అంతర్యుద్ధంలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దేశంలోని పశ్చిమ రఖైన్ ప్రావిన్స్‌లో సైనిక ప్రభుత్వం జరిపిన భయానక వైమానిక దాడిలో 49 మంది పౌరులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొక 58 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో వ్యాపారులు, కొనుగోలుదారులు, పాదచారులు ఉన్నట్లు తెలిసింది.
తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స పొందుతున్నారు. మిలిటరీ రహిత, సాయుధ తిరుగుబాటు దళమైన ‘అరకాన్ ఆర్మీ’ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడి రఖైన్ ప్రాంతాన్ని తీవ్ర భయాందోళనల్లోకి నెట్టివేసింది.
* విగతజీవులుగా మారిన వ్యాపారులు..
స్థానిక వర్గాల కథనం ప్రకారం.. రఖైన్ ప్రావిన్స్ పరిధిలోని రద్దీగా ఉండే వ్యాపార సముదాయాలు, మార్కెట్ ప్రాంతాలే లక్ష్యంగా సైనిక విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. నిత్యం కొనుగోలుదారులు, వ్యాపారులు, సాధారణ పాదచారుల రాకపోకలతో కిక్కిరిసి ఉండే సమయంలో ఒక్కసారిగా పేలుళ్లు సంభవించడంతో భారీ ప్రాణనష్టం సంభవించింది.
మృతుల్లో ఎక్కువ మంది వ్యాపారులు, స్థానిక కొనుగోలుదారులు మరియు బాటసారులే ఉన్నారు. దాడుల ధాటికి సమీపంలోని వాహనాలు, వ్యాపార సముదాయాలు పూర్తిగా ధ్వంసమై బూడిదయ్యాయి.
* మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
దాడి జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు తీవ్రంగా గాయపడిన 58 మందిని చికిత్స నిమిత్తం సమీప వైద్య శిబిరాలకు తరలించాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.
తమ నియంత్రణను కోల్పోతున్న ప్రాంతాల్లో మిలిటరీ ప్రభుత్వం ఇలా పౌరులపై విచక్షణారహితంగా దాడులకు తెగబడటం పట్ల మానవ హక్కుల సంఘాలు ఖండించాయి. తీవ్ర దిగ్భ్రాంతి, నిరసన వ్యక్తం చేస్తున్నాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
