CM Chandrababu, Mission Karmayogi Vijayawada
* వికసిత భారత్‌పై చంద్రబాబు
* విజయవాడలో మిషన్ కర్మయోగి ప్రాంతీయ సదస్సు
ఆకేరు న్యూస్, విజయవాడ : నైపుణ్యంతోనే వికసిత భారత్ సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మిషన్ కర్మయోగి దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సివిల్ సర్వీసెస్ అధికారుల్లో, ప్రభుత్వ ఉద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు మిషన్ కర్మయోగి పథకాన్ని తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
సరైన సమయంలో సరైన వ్యక్తి దేశానికి ప్రధానిగా ఉన్నారని పేర్కొన్నారు. భారత్‌కు అభివృద్ధి చెందిన దేశంగా మారే సంపూర్ణ సామర్థ్యం ఉందని వ్యాఖ్యానించారు. రాబోయే 20 ఏళ్లు భారతదేశ భవిష్యత్తుకు ఎంతో కీలకమైనవని ఆయన స్పష్టం చేశారు.
* వర్సిటీ స్థాయి నుంచి ఐటీ సంస్కరణల వరకు..
తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ.. యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచానని, ఆనాటి నుంచి నేటి వరకు దేశంలో జరిగిన అనేక ఆర్థిక, సాంకేతిక మార్పులను ప్రత్యక్షంగా చూశానని చంద్రబాబు తెలిపారు. “విద్యుత్ సదుపాయం కూడా లేని ఒక సాధారణ గ్రామంలో జన్మించిన నేను, ఆ తర్వాత కాలంలో ఏపీలో విద్యుత్ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాను.
అలాగే దేశంలోనే తొలిసారిగా ఐటీ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి సంస్కరణలు చేపట్టాను” అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ప్రముఖ ఐటీ కంపెనీలన్నింటికీ భారత సంతతి వ్యక్తులే సిఈఓలుగా, నాయకులుగా వ్యవహరించడం మన మానవ వనరుల నైపుణ్యానికి నిదర్శనమన్నారు.
* శిక్షణతోనే సమర్థవంతమైన పాలన..
1991లో భారత్ ఆర్థిక సంస్కరణలను ప్రారంభించిందని, 1994 సమయానికి భారత్, చైనాల ఆర్థిక వ్యవస్థలు దాదాపు సమానంగా ఉన్నాయని చంద్రబాబు గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం చైనా ఆర్థిక వ్యవస్థ భారత్ కంటే ఐదు రెట్లు ఎక్కువగా ఉందన్నారు. భారత్‌కు నైపుణ్యం కలిగిన యువతయే అసలైన బలమని, వారి సామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ కింది స్థాయి సిబ్బందికి నిరంతరం శిక్షణ ఇస్తూ, ప్రతిభను వెలికితీయాలని, అప్పుడే పాలనలో పారదర్శకత, వేగం పెరుగుతాయని సూచించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
