Free Auto Service
* తండ్రి జ్ఞాపకార్థం ఉచిత ఆటో సేవలు
Free Auto Service| ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: మానవత్వం మంటగలుస్తున్న ఈ రోజుల్లో తన తండ్రి జ్ఞాపకార్థం ఓ ఆటోవాలా చేస్తున్న సేవలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ వికలాంగులు, వృద్ధులు, గర్భిణులు, అత్యవసర వైద్యం అవసరమైన వారికి తన సొంత ఆటోలో ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెంకు చెందిన బెలిదే రమేష్ జ్ఞాపకార్థం ఆయన కుమారుడు శంకర్ ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రికి వెళ్లాల్సిన గ్రామస్తులను ఇప్పటివరకు పలుమార్లు తన ఆటోలో ఉచితంగా ఆస్పత్రులకు తీసుకెళ్లారు.
ఆపదలో అండగా..
ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలంటే డబ్బు కంటే మంచి మనసు ముఖ్యమనే ఆలోచనతో శంకర్ తన ఆటోను సేవా వాహనంగా మార్చుకున్నారు. తండ్రి జ్ఞాపకాన్ని కేవలం మాటల్లో కాకుండా ప్రజలకు ఉపయోగపడే సేవగా కొనసాగిస్తున్నారు.
ఇప్పగూడెంకు మాత్రమే పరిమితం కాకుండా చుట్టుపక్కల గ్రామాలతో పాటు స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి ప్రాంతాల్లో అత్యవసర వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్లాల్సిన వారు తనను సంప్రదిస్తే ఎలాంటి ఛార్జీలు తీసుకోకుండా ఉచితంగా తీసుకెళ్తానని శంకర్ తెలిపారు.
ఫోన్ చేస్తే చాలు..
అత్యవసర సమయంలో ఉచిత ఆటో సేవలు అవసరమైన వారు 9000351405 నంబర్‌కు సంప్రదించాలని శంకర్ సూచించారు. తన సేవల గురించి ప్రజలకు తెలియజేసేందుకు ఆటోపై కూడా ఉచిత రవాణా సదుపాయం వివరాలను స్పష్టంగా రాయించినట్లు తెలిపారు.
ముఖ్యంగా వికలాంగులు, వయోవృద్ధులు, గర్భిణులు, అత్యవసర వైద్యం అవసరమైన వారికి తన సేవలు అందించేందుకు ముందుంటానని శంకర్ చెప్పారు. డబ్బు కోసం కాకుండా ఆపద సమయంలో ఒకరికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ సేవను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
