* ఇద్దరం సివిల్స్ రాద్దాం.. నాకంటే ఎక్కువ మార్కులు సాధించాలని బాలలత సవాల్
* స్మితాపై చర్యలు తీసుకోకుంటే ట్యాంక్‌బండ్‌పై రేపు నిరసన చేపడాతమని హెచ్చరిక
* అయినా వెనక్కి తగ్గని సబర్వాల్
* తన పోస్టును సమర్థించుకుంటూ మరో పోస్టు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దివ్యాంగుల రిజర్వేషన్లు, ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS) ల విధులకు సంబంధించి ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ (IAS officer Smita Sabharwal) ఎక్స్ (X)వేదికగా పెట్టిన పోస్టు తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై దివ్యాంగులు గరం గరం అవుతున్నారు. ప్రభుత్వం ఆమెపై చర్యలు తీసుకోకపోతే రేపు ట్యాంక్‌బండ్‌పై నిరసనకు సిద్ధం అవుతామని హెచ్చరించారు. ఇంతకీ స్మితా సబర్వాల్ ఏం పోస్టు చేశారు అంటే..
వైకల్యం ఉన్నవారిని గౌరవిస్తాను కానీ..
‘ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసు ఉద్యోగులు ఎక్కువగా క్షేత్ర స్థాయిలో పని చేయాల్సి ఉంటుంది. ప్రజల కష్టాలను నేరుగా వినాల్సి ఉంటుంది. దీనికి శారీరక దృఢత్వం అవసరం.. కొన్నిసార్లు కఠిన సమయాల్లో పని చేయాల్సి ఉంటుంది. వైకల్యం ఉన్న వారిని గౌరవిస్తున్నాను. కానీ వైకల్యం ఉన్న ఫైలట్‌ను విమానయాన సంస్థలు నియమించుకుంటాయా? వైకల్యం ఉన్న సర్జన్ సేవలను మీరు విశ్వసిస్తారా?’ అని స్మితా సబర్వాల్ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఇప్పుడు అదే తీవ్ర దుమారానికి కారణమవుతోంది. దీనిపై దివ్యాంగుల సంఘం, ప్రముఖ మోటివేటర్ (Motivator), సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలు బాలలత (Balalatha) (దివ్యాంగురాలు) తదితరులు తీవ్రంగా స్పందించారు.
హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం ఏర్పాటు చేసి.. అంగవైకల్యం ఉన్న వారి గురించి మాట్లాడ్డానికి స్మితకు ఉన్న అర్హతలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. అసలే వివక్షకు గురవుతున్న దివ్యాంగులను స్మిత వ్యాఖ్యలు కుంగదీస్తున్నాయని అన్నారు. కోడ్ ఆఫ్ కండెక్ట్, సివిల్ సర్వెంట్ క్రమశిక్షణ రాహిత్యం కింద స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇద్దరం సివిల్స్ పరీక్ష రాద్దామని, తనకంటే ఎక్కువ మార్కులు సాధించాలని స్మితాకు బాలలత సవాల్ విసిరారు. ఈ సందర్భంగా అంగవైకల్యంతో బాధపడుతూ విజయాలు సాధించిన జైపాల్‌రెడ్డి, స్టీఫెన్ హాకింగ్, సుదా చంద్రన్ తదితరుల గురించి ఆమె ఉదహరించారు. పదేళ్ల పాటు సీఎంవోలో పనిచేసి కనీసం అడ్మినిస్ట్రేషన్‌పై అవగాహన లేకుండా మాట్లాడటం బాధాకారమన్నారు. 24 గంటల్లోపు తన మాటలు వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. రేపటిలోగా ప్రభుత్వం స్మితాపై చర్యలు తీసుకోకపోతే ట్యాంక్ బండ్‌పైన నిరసన తెలియజేస్తామని బాలలత హెచ్చరించారు.
స్మిత మరో పోస్టు..
ఓ వైపు ఆమె ఎక్స్ లో పెట్టిన పోస్టుపై దుమారం రేగుతుండగానే.. స్మితా సబర్వాలు మరో పోస్టు పెట్టారు. ఐపీఎస్, ఐఎఫ్‌ఓఎస్‌తో పాటు రక్షణ లాంటి రంగాల్లో దివ్యాంగుల కోటా ఇప్పటికీ ఎందుకు అమలు చేయడం లేదో తనను ప్రశ్నిస్తున్న వారు సమాధానం చెప్పాలని స్మితా డిమాండ్ చేశారు. ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్ లాగే ఐఏఎస్ కూడా అంతేకదా అని ఆమె నిలదీశారు. తన అభిప్రాయాన్ని పరిశీలించాలని హక్కుల కార్యకర్తల్ని కోరుతున్నట్టుగా ఆమె పేర్కొన్నారు. సున్నితత్వానికి తన మనసులో స్థానం లేదని ఆమె స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదం అంత ఈజీగా సద్దుమణిగేలా కనిపించడం లేదు.
————————–