* శిరీష (బర్రెలక్క ) ఎంపీ అభ్యర్థిగా నామినేషన్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : సోషల్‌మీడియా ద్వారా స్టార్ అయి.. గత ఎన్నికల్లో పొలిటికల్ స్టార్‌గా మారి వార్ మొదలుపెట్టిన శిరీష బర్రెలక్క మరోసారి ఎన్నికల భేరి మోగించారు. ఎంపీ ఎన్నికల్లోనూ సై అంటున్నారు. నాగర్ కర్నూలు ఎంపీ స్థానానికి నామినేషన్ వేసి మరోసారి వార్తల్లోకెక్కారు. గత అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆమె ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అవమానాలు, దాడులు కూడా ఎదుర్కొని నిలబడి.. నాగర్ కర్నూల్ జిల్లా కొల్హాపూర్ నియోజక వర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలో నిలబడ్డారు. ఆమె కోసం జరిగిన ప్రచారం ఓ రకంగా బలమైన ప్రత్యర్థులను సైతం కలవరపెట్టింది. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో శిరీషకు 5,754 ఓట్లు పోలయ్యాయి. అయితే అక్కడ ఓడిపోయినా ఆగిపోనంటూ..పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని అప్పుడే చెప్పింది. తర్వాత మార్చి నెలలో వెంకటేశ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో బర్రెలక్క రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడినట్లే అనుకున్నారు అంతా.
ఆశీర్వదించండి అంటూ పోస్ట్
పార్లమెంటు ఎన్నికల నగారా మోగిన తర్వాత కూడా ఎలాంటి పొలిటికల్ ప్రకటన లేకపోవడంతో శిరీష ఇకపై రాజకీయాలకు దూరం అని అనుకున్నారు. కానీ అనూహ్యంగా తాను ఎంపీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగుతానంటూ..మంగళవారం కలెక్టరేట్లో నామినేషన్ దాఖలుచేశారు. తనను అందరూ ఆశీర్వదించాలని.. పెద్ద మనసుతో దీవించి, ఆశీర్వదించండి అంటూ వీడియో పోస్టు చేసింది. ఇప్పటికే ప్రచారం కూడా మొదలు పెట్టేసిన శిరీష.. ఆ వీడియోను కూడా నెట్టింట్లో పోస్టు చేసింది . ఎంపీకి యుద్ధం మొదలు అయ్యిందంటూ ప్రచారంలో పాల్గొన్న వీడియో..ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అలాగే తనలా కొత్తగా నామినేషన్ దాఖలు చేయాలనుకనే వారికి నామినేషన్ పత్రాలు ఎక్కడ దొరుకుతాయి..నామినేషన్ ఎలా వేయాలన్న సూచనలు కూడా చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో శిరీషకు మద్దతుగా సోషల్ మీడియాల ప్రచారం హోరెత్తింది. పలువురు కొల్లాపూర్ వెళ్లి ఆమెకు మద్దతుగా ప్రచారంలో కూడా పాల్గొన్నారు. మరి ఎంపీ ఎన్నికల్లో శిరీషకు ఎలాంటి ఫలితాలు దక్కుతాయో వేచి చూడాల్సిందే.
——————————–