Bhadrachalam Hospital Ambulance Negligence
ఆకేరు న్యూస్ భద్రాచలం:
ప్రభుత్వాలు మారుతున్నా, ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని పాలకులు ఎన్ని ప్రగల్భాలు పలుకుతున్నా, క్షేత్రస్థాయిలో పేదలకు మాత్రం కన్నీళ్లే మిగులుతున్నాయి. అత్యవసర సమయాల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం, కఠిన హృదయం ఓ పేద కుటుంబానికి గుండెకోతను మిగిల్చింది. కనీసం మరణించిన వ్యక్తికి ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని కూడా ఇవ్వకుండా, మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ నిరాకరించడంతో, ఆ కుటుంబ సభ్యులు శవాన్ని భుజాలపై మోసుకెళ్లిన హృదయ విదారక ఘటన భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
* వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయిన వెంకన్న
భద్రాచలం పట్టణంలోని సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన కండె వెంకన్న (42) అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించినప్పటికీ, ఫలితం లేకపోవడంతో వెంకన్న ఆదివారం రాత్రి ఆసుపత్రిలోనే కన్నుమూశాడు. సంపాదించే వ్యక్తిని కోల్పోయి ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయింది.
* అంబులెన్స్ ఇచ్చేందుకు నిరాకరణ
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైనా చికిత్స పొందుతూ మరణిస్తే, వారి మృతదేహాన్ని ఉచితంగా వారి స్వగ్రామానికి లేదా ఇంటికి చేర్చడానికి ప్రభుత్వ అంబులెన్స్ (పరమపద వాహనం లేదా ఉచిత వాహన సేవలు) సమకూర్చాలి. ఇది పేద ప్రజల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కనీస సౌకర్యం కానీ, వెంకన్న మరణించిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని ఆసుపత్రి సిబ్బందిని వేడుకున్నారు. అయితే, అక్కడి సిబ్బంది ఏమాత్రం మానవత్వం లేకుండా ప్రవర్తించారు. వాహనం అందుబాటులో లేదనో, సాంకేతిక కారణాలనో చెబుతూ అంబులెన్స్ ఇచ్చేందుకు మొండిగా నిరాకరించారు. “ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉచితంగా మృతదేహాన్ని తరలించాల్సిన బాధ్యత ఆసుపత్రి యాజమాన్యానిదే. కానీ ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యం పేద కుటుంబానికి శాపంగా మారింది.
* ప్రైవేట్ వాహనానికి స్తోమత లేక.. భుజాలపైనే శవయాత్ర
దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి ప్రైవేట్ అంబులెన్స్ లేదా ప్రైవేట్ వాహనాన్ని మాట్లాడుకునే ఆర్థిక స్తోమత లేదు. వెంకన్న మరణంతో అప్పటికే కన్నీరుమున్నీరవుతున్న ఆ పేద కుటుంబం, ఆసుపత్రి సిబ్బంది కనికరిస్తారేమోనని గంటల తరబడి వేచి చూసింది. అయినా ఎవరిలోనూ చలనం రాకపోవడంతో, చివరకు వేరే దారి లేక గుండె నిండా బాధతో మృతదేహాన్ని తమ భుజాలపైనే మోస్తూ ఆసుపత్రి నుంచి ఇంటికి బయలుదేరారు.భద్రాచలం లాంటి పెద్ద పట్టణంలో, నడిరోడ్డుపై ఒక ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు భుజాలపై మోసుకెళ్తుంటే స్థానికులు, దారిపొడవునా ఉన్న ప్రజలు ఈ దృశ్యాన్ని చూసి కన్నీరు పెట్టారు. సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
* బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. వైద్య రంగంలో ఎన్నో సంస్కరణలు తెస్తున్నామని చెబుతున్న అధికారులు, ఈ ఘటనపై ఏం సమాధానం చెబుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి, మానవత్వాన్ని మంటగలిపిన భద్రాచలం ఏరియా ఆసుపత్రి సిబ్బందిపై తక్షణమే విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని సుభాష్ నగర్ కాలనీవాసులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు.
