Black Jamun Benefits and Side Effects
ఆకేరు న్యూస్, డెస్క్: ఎండకాలం ముగిసి వర్షాకాలం మొదలైందంటే చాలు మార్కెట్లో నల్లటి ముత్యాల్లాంటి నేరేడు పండ్లు (Black Jamun) సందడి చేస్తాయి. రుచితో పాటు అపారమైన ఆరోగ్య నిధులు, ఆయుర్వేద గుణాలు ఉన్న ఈ పండు డయాబెటిస్ బాధితులకు ఒక సంజీవనిలా పనిచేస్తుంది.
అయితే, ఈ పండు అందరికీ మేలు చేయదు. కొంతమంది దీనిని తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
* అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..
మధుమేహ నియంత్రణ..
ఇందులో ఉండే ‘జాంబోలిన్’, ‘జాంబోసిన్’ గ్లూకోసైడ్లు పిండిపదార్థాలు చక్కెరగా మారకుండా నిరోధించి, బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపు చేస్తాయి. గింజల పొడి కూడా షుగర్ రోగులకు ఎంతో మేలు చేస్తుంది.
గుండె భద్రత..
100 గ్రాముల నేరేడులో ఉండే 79 మి.గ్రా పొటాషియం హైబీపీని తగ్గించి, స్ట్రోక్ ప్రమాదం నుండి కాపాడుతుంది.
ఇమ్యూనిటీ బూస్టర్..
విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, వైరల్ జ్వరాలను దూరం చేస్తాయి.
రక్తహీనతకు చెక్.. ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
ఎవరెవరు తినాలి అంటే..
టైప్-2 డయాబెటిస్ బాధితులు, రక్తహీనత (Anemia) ఉన్నవారు, బరువు తగ్గాలనుకునే వారు మరియు నోటి పూత, చిగుళ్ల సమస్యలతో బాధపడేవారు ఈ పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు.
* ఎవరు తినకూడదు..
సర్జరీ చేయించుకునే వారు: ఇవి రక్తం గడ్డకట్టే ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. కాబట్టి ఆపరేషన్‌కు రెండు వారాల ముందు, తర్వాత వీటికి దూరంగా ఉండాలి.
కీళ్ల నొప్పుల బాధితులు..
ఆయుర్వేదం ప్రకారం నేరేడు శరీరంలో వాతాన్ని పెంచుతుంది. ఒంటి నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవారు తింటే సమస్య మరింత తీవ్రమవుతుంది.
తీవ్ర మలబద్ధకం..
ఇందులోని వగరు గుణం (Astringent property) వల్ల తీవ్ర మలబద్ధకం ఉన్నవారికి ఇబ్బంది పెరుగుతుంది. గర్భిణీలు కూడా డాక్టర్ సలహాతోనే తీసుకోవాలి.
* తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
దీనిని ఎప్పుడూ పరగడుపున (ఖాళీ కడుపుతో) తినకూడదు; తింటే ఎసిడిటీ వస్తుంది. అలాగే నేరేడు పండ్లు తిన్న వెంటనే పాలు తాగడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. రోజుకు 50-80 గ్రాముల మోతాదులోనే తినడం ఆరోగ్యానికి సురక్షితం.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
