Tulsi Gabbard alleges American funds supported Wuhan lab research.
* నిఘా విభాగం మాజీ చీఫ్ తులసీ గబార్ద్ సంచలనం
* ముసుగు తొలగిన ‘బయో’ బంధం
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి :
కరోనా మహమ్మారి జగత్తును అతలాకుతలం చేసి ఏళ్లు గడుస్తోంది. కోట్ల మంది ప్రాణాలను బలిగొన్నది..
ఈ మారణ హోమానికి అసలు కారణం ఎవరు.? అన్న విషయాలు మాత్రం ఇప్పటికీ తెలియ రాలేదు.
ఆ ‘అదృశ్య హంతకుడి’ పుట్టుకపై మిస్టరీ వీడలేదు. చైనాలోని వుహాన్ మార్కెట్టే దీనికి కేంద్రమని, డ్రాగన్ దేశమే ఈ విపత్తును ప్రపంచంపైకి వదిలిందని ఇప్పటివరకు ప్రచారం సాగింది. ఇదంతా ఒక ఎత్తు.
కాగా, ఈ ‘మహా పాపం’ వెనుక కేవలం చైనా ఉందన్న గుసగుసలే కాదు, అగ్రరాజ్యం అమెరికా డాలర్ల చప్పుడు కూడా ఉందన్న ప్రచారం ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ విషయాలు మాట్లాడింది రాజకీయ నాయకులో , అనామకులో కాదు.. ఏకంగా అగ్రరాజ్యం అమెరికా నిఘా విభాగం మాజీ అధిపతి తులసీ గబార్డ్ (TULSI GABBARD) … ఆమె బయటపెట్టిన పత్రాలు, గడిచిన కాలంలో వెలుగుచూసిన అంతర్గత నివేదికలు చేదు సత్యాన్ని చాటుతున్నాయి.
కరోనా సృష్టిలో చైనాది ‘కృషి’ అయితే, దానికి వెన్నుదన్నుగా నిలిచింది అమెరికా ఆర్థిక సంకల్పం అని తులసీ గబార్డ్ చెబుతోంది.

* గెయిన్ ఆఫ్ ఫంక్షన్ అంటే..?
భవిష్యత్తులో రాబోయే మహమ్మారులను ముందే అంచనా వేసి వ్యాక్సిన్లు కనిపెట్టాలనే లక్ష్యంతో శాస్త్రవేత్తలు చేసే ప్రమాదకరమైన ప్రయోగాన్నే గెయిన్ ఆఫ్ ఫంక్షన్ (Gain of Function) అంటారని నిపుణులు చెబుతున్నారు.
అంటే, బలహీనంగా ఉన్న వైరస్‌కు ల్యాబొరేటరీలో ముక్కు, ముఖం, కోరలు తొడిగి.. అది మానవ కణాలపై మరింత వేగంగా దాడి చేసేలా బలోపేతం చేసి దాన్ని అరికట్టడానికి అవసరమైన సంసిద్దత లాబోరేటరీ ద్వారా సాధించే పరిశోధనలు చేస్తారు.
అమెరికాలోనే ఈ తరహా పరిశోధనలపై తీవ్రమైన నిషేధం ఉంది . నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ ( NIH ) వంటి ప్రభుత్వ సంస్థలు, ఎకోహెల్త్ అలయన్స్ అనే మధ్యవర్తిత్వ సంస్థ ద్వారా చైనాలోని వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (WIV)కి మిలియన్ల కొద్దీ డాలర్ల నిధులను ధారపోశాయని గబార్డ్ చెబుతున్నారు .
అమెరికా నిధులు ఇవ్వడం, చైనా ల్యాబ్‌లో గబ్బిలాల వైరస్‌లను మరింత ప్రాణాంతకంగా మార్చడం వంటి అంశాలు సమాంతరంగా సాగాయంటున్నారు.
* మరీ.. అమెరికాకు ఏం లాభం ?
ప్రపంచానికి ఆరోగ్య సూత్రాలు చెప్పే అమెరికా, కమ్యూనిస్ట్ చైనా ల్యాబ్‌కు నిధులు ఎందుకు సమర్పించుకుంది? దీని వెనుక ఉన్న అసలు కారణాలు తెలియాల్సి ఉంది. తమ దేశంలో ఉన్న నిషేదంతో పాటు ప్రమాదకరమైన వైరస్ లీక్ అయితే తమ దేశ పౌరులకు ముప్పు వాటిల్లుతుందనే భయం కూడా ఉన్నట్లు కనిపిస్తోంది.
అలాంటి ఆలోచనా ధోరణితోనే అమెరికా హై-రిస్క్ ప్రయోగాలను చైనా లాంటి దేశాలకు అవుట్సోర్సింగ్ ఇచ్చి ఉండవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అంతేకాకుండా ప్రపంచాన్ని భయపెట్టే వైరస్ నియంత్రణ సూత్రాలు, వ్యాక్సిన్ ఫార్ములాలపై ముందే పట్టు సాధిస్తే, గ్లోబల్ ఫార్మా మార్కెట్‌ను శాసించవచ్చనే పరోక్ష వ్యూహం కూడా ఇందులో దాగి ఉందనే విశ్లేషణలు ఉన్నాయి.
* చైనా నిర్లక్ష్యం – అమెరికా మౌనం
వైరస్ వుహాన్ ల్యాబ్ భద్రతా లోపాల వల్ల బయటకు లీక్ అయిందనే ‘ల్యాబ్ లీక్ సిద్ధాంతం’ (Lab Leak Theory) నేడు అంతర్జాతీయంగా బలపడుతోంది. ఒకవేళ చైనా నిర్లక్ష్యం వల్లే ఇది లీక్ అయి ఉంటే, ఆ ల్యాబ్‌కు, ఆ ప్రయోగాలకు ఆక్సిజన్ అందించిన అమెరికా ఆ పాపం నుండి ఎలా తప్పుకోగలదన్న వాదనలు ఇప్పుడు బలపడతున్నాయి.
వైరస్ లీక్ అయిన విషయాన్ని దాచడం, ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించడం, తొలి రోజుల్లోనే వుహాన్ మార్కెట్‌ను క్లీన్ చేసి ఆధారాలు ధ్వంసం చేయడం చైనా చేసిన తప్పిదంగా ప్రపంచమంతా భావిస్తున్నారు.. తమ నిధులతోనే చైనాలో ఒక రాక్షస వైరస్ తయారవుతోందని తెలిసి కూడా అమెరికా అంటువ్యాధుల నిపుణులు, ఉన్నతాధికారులు నిజాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
డాక్టర్ ఆంథోనీ ఫౌచీ ఈ- మెయిళ్లు, పార్లమెంటరీ కమిటీల విచారణ నివేదికలు చూస్తే తప్ప వాస్తవాలు వెలుగులోకి రాకపోవడం ఘోర తప్పిదంగా భావిస్తున్నారు.
* శత్రుత్వం మాటున మిత్రుత్వం
భౌగోళిక రాజకీయాల్లో అమెరికా, చైనాలు బద్ధశత్రువుల్లా ప్రవర్తిస్తున్నప్పటికీ , తెరవెనుక సాగిన ఈ బయో-ల్యాబ్ వ్యవహారం వారి మధ్య ఉన్న అప్రకటిత బంధాన్ని బహిర్గతం చేస్తోంది. కోట్లాది మంది మృతదేహాల దిబ్బలపై నిర్మించబడిన మహా సామ్రాజ్యం. దీనికి చైనాకు ఎంత బాధ్యత ఉందో అమెరికా కూడా అంతే భాద్యత ఉందని అమెరికా నిఘా విభాగం మాజీ అధిపతి అయిన తులసీ గబార్డ్ లాంటి వారు బయటపెట్టిన పత్రాల వల్ల తేలిపోయింది.
——————————————
