KTR slammed the Future City CM Revanth Reddy
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా దారితప్పిందని, రాబోయే ఎన్నికల కోసం తెలంగాణ ప్రజలు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజా కంటక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ప్రజలు బంగాళాఖాతంలో పడేయడం ఖాయమని హెచ్చరించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ కీలక సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
* పార్లమెంట్లో బీఆర్ఎస్ లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది…
దేశ రాజధాని సాక్షిగా తెలంగాణ అస్తిత్వానికి, హక్కులకు భంగం కలుగుతున్నా అడిగే దిక్కు లేకుండా పోయిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ లేని లోటు ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటును, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను అవమానించేలా బీజేపీ ఎంపీలు మాట్లాడుతున్నా, ఇక్కడి నుంచి గెలిచిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయారని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల కంటే తమకు ఢిల్లీ బాసుల ఆదేశాలే ముఖ్యమన్నట్లుగా ఈ ఎంపీలు ప్రవర్తిస్తున్నారని, రాష్ట్ర హక్కుల కోసం గొంతుకెత్తే ఏకైక శక్తి బీఆర్ఎస్ మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.
* ఉన్న నగరాన్ని కాపాడలేరు, ఫ్యూచర్ సిటీ నిర్మిస్తారా…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టుపై కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మాట్లాడితే చాలు కోట్లు కుమ్మరించి ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ క్షేత్రస్థాయిలో ఉన్న అసలు నగరాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడని విమర్శించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనీస రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించే దిక్కులేని ఈ ప్రభుత్వం.. ప్రపంచ స్థాయి ఫ్యూచర్ సిటీని నిర్మిస్తుందా? అంటూ ఎద్దేవా చేశారు. ఇది కేవలం రియల్ ఎస్టేట్ దందాల కోసం మరియు ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఆడుతున్న నాటకమని ఆరోపించారు.
* మూసీ ప్రక్షాళన బీఆర్ఎస్ హయాంలోనే మొదలైంది…
మూసీ నది ప్రక్షాళన మరియు సుందరీకరణ ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని కేటీఆర్ తిప్పికొట్టారు. మూసీని తామేదో బాగు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి బిల్డప్ ఇస్తున్నారని, కానీ వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఎలాంటి విధ్వంసం లేకుండా, ఒక్క పేదవాడి ఇల్లు కూడా కూల్చకుండా మూసీ ప్రక్షాళన పనులు మొదలయ్యాయని గుర్తుచేశారు. నగరంలోని మురికి నీరు మూసీలోకి చేరకుండా వందల కోట్లతో అనేక ప్రాంతాల్లో అత్యాధునిక ఎస్టీపీలను (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు) ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బ్యూటిఫికేషన్ పేరుతో ‘లూటిఫికేషన్’ (దోపిడీ) కి తెరలేపిందని ధ్వజమెత్తారు.
* సర్వేల ఆధారంగానే జీహెచ్ఎంసీ టికెట్లు- కేటీఆర్ క్లారిటీ
రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) ఎన్నికలపై కేటీఆర్ పార్టీ శ్రేణులకు స్పష్టమైన వ్యూహాన్ని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు విషయంలో ఎలాంటి సిఫారసులకు తావుండదని తేల్చిచెప్పారు. క్షేత్రస్థాయిలో నిర్వహించే ఖచ్చితమైన వైజ్ఞానిక సర్వేల ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. ప్రజాదరణ ఉండి, ఖచ్చితంగా గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని, పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ పట్టును మళ్లీ నిరూపించేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
