Padi Kaushik Reddy Kannepalli
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
తెలంగాణలో సాగునీటి అంశంపై రాజకీయాలు మరింత వేడెక్కాయి. కన్నెపల్లి పంప్‌హౌస్ నుండి వెంటనే గోదావరి నీటిని ఎత్తిపోసి రైతాంగాన్ని కాపాడాలని హుజూరాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు ఏమాత్రం చిన్న సమస్య వచ్చినా తమ బీఆర్ఎస్ 28 మంది ఎమ్మెల్యేలందరం బాధ్యత తీసుకుని రాజీనామా చేస్తామని, రాజకీయాలకు దూరంగా ఉంటామని ప్రకటించారు. ఈ సవాల్‌కు సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సిద్ధమేనా అని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి బేషజాలకు పోకుండా వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తాలని డిమాండ్ చేశారు.
* సాగు, తాగునీటి ఎద్దడిపై హెచ్చరిక
కరీంనగర్ జిల్లాలో నీటిని ఎత్తిపోయకపోతే సాగునీటితో పాటు తీవ్ర తాగునీటి సమస్య కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని కౌశిక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కేటీఆర్‌లతో కలిసి ఎల్ఎండీ జలాశయాన్ని పరిశీలించామని, అక్కడ చుక్క నీరు కూడా లేదని పేర్కొన్నారు. నీటి సమస్యపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు రక్తం అడుగుతున్నారని, రైతుల కోసం తమ రక్తమైనా ఇస్తాం కానీ వెంటనే నీళ్లు విడుదల చేయాలని స్పష్టం చేశారు. కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీరు ఎత్తకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
* నాట్లు వేసే సమయమైనా అందని మక్క పైసలు
హుజూరాబాద్ నియోజకవర్గంలోని మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు 60 నుండి 70 శాతం మాత్రమే డబ్బులు జమ అయ్యాయని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. 300 బస్తాలు అమ్మిన రైతులకు 295 బస్తాల వరకే డబ్బులు వేస్తున్నారని, మిగిలిన ఐదు బస్తాల డబ్బులు ఎవరికి కమిషన్లుగా వెళ్తున్నాయని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఇప్పటికే నాట్లు వేసే సమయం ఆసన్నమైనా పూర్తిస్థాయిలో మక్కా రైతులకు నిధులు చెల్లించకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
