* ఏటేటా పెరుగుతున్న కేసులు
* ప్రపంచంలో ఎక్కువ కేసులు మనదగ్గరే..
* అప్రమత్తం కాకపోతే అనర్థమేనంటున్న వైద్య నిపుణులు
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ :
భారత దేశాన్ని క్యాన్సర్ మహమ్మారి వెంటాడుతోంది. ఇప్పటికే భారత దేశం ( India )డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ( Diabetes capital of the world ) గా పేరు తెచ్చుకుంది. ఇక క్యాన్సర్ ( Cancer ) విషయంలో కూడా మన దేశం అదే బాటలో నడుస్తోంది. దాని బారినపడుతున్న వారి సంఖ్య దేశంలో ఏటేటా పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితులు ప్రమాదకరంగానే ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అభివృద్ధి చెందుతున్న ఇండియాకు ఇది పెను సవాల్‌ను విసురుతోంది. ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్న దేశాల్లో ఇండియా ఒకటవడం ఆందోళన కలిగిస్తోంది. 2025 నాటికి 15లక్షల 70వేల వరకు కేసులు పెరిగే అవకాశముందని తాజాగా అపోలో హాస్పిటల్స్ ( Apollo Hospitals ) విడుదల చేసిన హెల్త్ ఆఫ్ ది నేషన్ నివేదిక ( Health of the Nation Report ) లో పేర్కొనడం పరిస్థితి ని కళ్లకు కడుతోంది. 2020లో 14లక్షల క్యాన్సర్ కేసులు నమోదైతే, ఇందులో 9లక్షల 10వేల మంది మృత్యువాత పడినట్టు ఆ నివేదికలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా 2022నాటికే రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడితే, 97లక్షల మంది చనిపోయినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. 2050 నాటికి కేసులు 3కోట్ల50లక్షలు చేరే అవకాశముంది.
* ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు..
క్యాన్సర్ కేసులు పెరుతుండడం కలవరపెడుతోంది. ఇండియాలో 2020లోనే 13.92 లక్షలు మంది, 2021 సంవత్సరంలో 14.26 లక్షల మంది, 2022 లో 14.61 ప్రజల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. క్యాన్సర్మతో 2018లో 7.33 లక్షల మంది, 2022లో 8.08 లక్షల మంది చనిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ,ఢిల్లీ ( ఎయిమ్స్ ) నివేదికలో పేర్కొన్నట్టు 2026 నాటికి ఈ మరణాల సంఖ్య ప్రతి సంవత్సరం 20 లక్షలకు చేరే అవకాశముందని పేర్కొంది.
* వయసుతో నిమిత్తం లేకుండానే..
ఇండియాలో క్యాన్సర్ కేసులు వయసుతో నిమిత్తం లేకుండానే పెరగడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. చైనా, అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో 60 ఏళ్లు పైపబడిన వారిలో క్యాన్సర్ లక్షణాలు బయటపడుతుంటే, ఇండియాలో కేవలం 50 ఏళ్లు దాటిన వారిలో నే లక్షణాలు ఉండడం వైద్యరంగాన్ని కలవరపెడుతోంది. ఇండియాలో ఎక్కువగా బ్రెస్ట్ , ఊపిరి తిత్తులు, నోటి, పెద్ద పేగు, వృషణ, గొంతు క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి.
* క్యాన్సర్ బారిన సెలబ్రటీలు..
క్యాన్సర్ బారిన పడిన వారిలో ఎంతో మంది సెలబ్రటీలు ఉన్నారు. బాలీవుడ్ నటీమణులు మనీషా కొయిరాల, సొనాలీ బింద్రే, హాలీవుడ్ నటి ఎంజిలాజోలి.. తాజాగా టాలీవుడ్ నటి హంసనందిని కూడా క్యాన్సర్ తో పోరాడి విజయం సాధించారు. అలాగే క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా క్యాన్సర్ జయించినవారిలో ఒకరు. ఈ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తె చికిత్స నయం కావచ్చని వైద్యలు సూచిస్తున్నారు. క్యాన్సర్ మహమ్మారి ఏటా రూ.41, 17, 000 కోట్లు హరిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.మూడింట రెండొంతుల క్యాన్సర్ మరణాలు పేద, మధ్యతరగతి దేశాల్లోనే ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.
* ఆహార అలవాట్లే కారణం..
క్యాన్సర్ బారిన పడడానికి ప్రధానంగా ఆహార అలవాట్లే కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. సమయ
పాలన లేకుండా భోజనం చేయడం, అతిగా మద్యం సేవించడం, ఎక్కువ నూనెతో తయారైన పదార్థాలు, వేపుడు ఆహారం తినడం ద్వారానే క్యాన్సర్ బారిన పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే పొగాకు, గుట్కాలు నమలడం, సిగరేట్లతోపాటు గంజాయివంటి మత్తు పదార్థాలు తీసుకోవడంతో కేసులు పెరుగుతున్నాయి. గర్భాశయం, రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తులు, పేగులు, శ్వాస నాళాలు మొదలైన భాగాలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ. నిత్యం వ్యాయామం, జంక్ ఫుడ్లకు దూరంగా ఉండడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
————————————-