* ఉత్సాహంగా తొలిదశ ఎన్నికల పోలింగ్
* ఓ పోలింగ్ కేంద్రంలో అపశ్రుతి
* జవాన్ అనుమానాస్పద మృతి
ఆకేరున్యూస్, న్యూఢిల్లీ :
దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ఆశాజనకంగా కొనసాగుతోంది. తొలి దశలో కీలక స్థానాల్లో పలువురు ప్రముఖులు బరిలోకి దిగారు. అందులో కేంద్ర మంత్రులు, నితిన్ గడ్కరీ, సర్బానంద సోనోవాల్‌తో పాటు మరో ఏడుగురు కేంద్ర మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గౌరవ్ గగోయ్, డీఎంకే నుంచి కనిమొళి కూడా తొలి దశలో పోటీ చేస్తున్నారు. ఇక ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో పాపులర్ అయిన బీజేపీ నేత అన్నామలై పోటీ చేస్తున్న కొయంబత్తూర్‌లో కూడా తొలి విడతలో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కాగా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు భద్రత పెంచారు.
తమిళనాడుకు ఒకే దశలో..
తమిళనాడు లోని 39 లోక్ సభ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఉదయమే ప్రముఖులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్, సినీ, రాజకీయ ప్రముఖులు రజనీకాంత్, అజిత్, ఖుష్బు, పళనిస్వామి తదితరులు ఓటువేశారు.
తొలి దశలో కీలక నియోజకవర్గాలు
ఉత్తరప్రదేశ్, అసోం, ఛత్తీస్‌గఢ్, బీహార్, జమ్మూకాశ్మీర్, మధ్యప్రదేశ్, తమిళనాడు, మణిపూర్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లలో మొదటి దశ ఎన్నికలలో కీలకమైన నియోజకవర్గాలు ఉన్నాయి. నాగ్‌పూర్ నుంచి కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, అరుణాచల్‌ప్రదేశ్ (పశ్చిమ) నుంచి కిరణ్ రిజిజు, రాజస్థాన్ బికనీర్ నుంచి అర్జున్ రామ్ మేఘ్వాల్, , అసోంలోని దిబ్రూఘర్ నుంచి సర్బనాద సోనోవాల్, పశ్చిమ యూపీలోని ముజఫర్‌నగర్ నుంచి సంజీవ్ బలియన్, జమ్మూకాశ్మీర్ లోని ఉధంపూర్ నుంచి జితేంద్ర సింగ్, రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన భూపేంద్ర యాదవ్ వంటి ప్రముఖ నేతలు మొదటి దశలో తమ ఎన్నికల అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి ఇటీవల తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్ చెన్నై సౌత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ చింద్వారా నుంచి తిరిగి ఎన్నికకు ప్రయత్నిస్తున్నారు. త్రిపురలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాలలో, మొదటి దశలో ఓటింగ్ జరిగే పశ్చిమ త్రిపుర స్థానానికి మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశిష్ కుమార్ సాహా మధ్య హై-వోల్టేజీ ఘర్షణ ఉంది. లోక్ సభ స్థానాలతోపాటూ.. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోని 92 అసెంబ్లీ స్థానాలకు కూడా ఓటింగ్ జరుగుతోంది.
పశ్చిమబెంగాల్ లో జవాన్ అనుమానాస్పద మృతి
ఎన్నికల వేళ పశ్చిమబెంగాల్ లో అపశ్రుతి చోటుచేసుకుంది. మాథాభాంగాలో ఉన్న ఓ పోలింగ్ బూత్ వాష్‌రూమ్‌లో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు. ఎన్నికల పోలింగ్ కు ముందే ఈ జగరినట్లు తెలుస్తోంది. కాగా, అతడిపై గాయాలు ఉ్ఆయని, జారిపడడం వల్ల మృతి చెంఇ ఉంటాడని డాక్టర్లు చెబుతున్నారు. జవాన్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తొలి దశ అంకెల్లో ఇలా..
– 102 లోక్ సభ నియోజకవర్గాలకు తొలిదశలో పోలింగ్ జరగనుంది.
– మొత్తం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
– 1625 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
– 16.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
– 50 శాతం పైగా పోలింగ్ కేంద్రాల్లోవెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు.
——————————————-