* తెలంగాణపై తప్పుడు ప్రచారాలు
* రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసే కుట్ర
* వాస్తవాలు కప్పిపుచ్చి బీఆర్ ఎస్ అసత్యాలు ప్రచారం చేస్తోంది
* ఎంత డిమాండ్ ఉన్నా కరెంట్ కోతల్లేకుండా సరఫరా చేస్తున్నాం
* 4 నెలల్లో 3,927 కోట్లు విద్యుత్ సబ్సిడీ చెల్లించాం
* 26 వేల కోట్ల అప్పు కట్టాం
* తప్పుడు ప్రచారాలు పారిశ్రామికాభివృద్ధికి ముప్పు
* ప్రజలకు నిజానిజాలు తెలియాలి
* మీడియాతో ముఖాముఖిలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ ఎస్ విష ప్రచారాలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కరెంట్ సరఫరా తీరుపై దుష్ప్రచారాలు చేస్తోందని వెల్లడించారు. ఓసారి కోర్టులో జడ్జి తీర్పు ఇస్తుండగా కరెంట్ పోయిందని, మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతుండగా కరెంట్ పోయిందని మరోసారి… సోషల్‌మీడియాలో తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వస్తే రాష్ట్రం అంతా చీకట్లో ఉంటుందని ఎన్నికల ముందు ప్రచారం చేసిన బీఆర్ ఎస్.. తమ ప్రభుత్వంలో అలాంటి పరిస్థితులు లేకపోవడంతో హీన రాజకీయాలకు దిగుతోందని చెప్పారు. ఈ తరహా ప్రచారాలు పారిశ్రామిక అభివృద్ధిని, తద్వారా రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీస్తాయని ఆందోళన వెలిబుచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి ఖజానాలో రూ. 7 వేల కోట్ల బ్యాలెన్స్ ఉందని చెబుతున్నారని, కానీ అప్పటికి ఖజానాలో 3 వేల 960 కోట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. మరి ఆ 7 వేల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు.
కరెంట్ నిరంత సరఫరా
ఈ మూడు నెలల కాలంలో తెలంగాణ విద్యుత్ డిమాండ్ పీక్ కు చేరిందని భట్టి వివరించారు. అయినా ఎక్కడా ఇబ్బందులు లేకుండా నిరంతరం కరెంట్ సరఫరా చేస్తున్నామని వివరించారు. బీఆర్ ఎస్ ప్రభుత్వ పదేళ్ల కాలంలో భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే.. ఈరోజు కరెంట్ కొనుక్కునే స్థితిలో తెలంగాణ ఉండేది కాదని చెప్పారు. ఉత్పత్తిపై దృష్టి పెట్టకుండా, యూనిట్ రూ. 20కు కొనుగోలు చేసి, అప్పులు పెంచేసి గొప్పలు చెప్పుకునేవారని విమర్శించారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.10 లోపే కరెంట్ కొనేలా, అదీ ఉన్న ప్రొడక్షన్‌ను ట్రాన్స్ స్పిరెంట్ గా చూసుకుంటూ, స్టాక్స్ ఎక్సేంజ్ మాదిరిగా, పవర్ ఎక్సేంజ్ చేసుకుంటూ.. పీక్ అవర్స్ లో 15 – 20 నిమిషాలు తక్కువైతే ఆ సమయంలోనే కొంటున్నామని వివరించారు.
గ్రీన్ పవర్‌ను అందిస్తాం
త్వరలోనే తెలంగాణకు గ్రీన్ పవర్ అందిస్తామని భట్టి వెల్లడించారు. యూనిట్‌కు 5 రూపాయల లోపే ఖర్చు అయ్యేలా మా ముఖ్యమంత్రి, మంత్రివర్గం ప్లాన్ చేస్తోందని వివరించారు. రాష్ట్రానికి న్యూ ఎనర్జీ పాలనీ అవసరం ఉందని, ఇప్పటికే దానిపై తాము కసరత్తు చేశామని, ఎన్నికలు అయ్యాక వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కోడ్ నేపథ్యంలో ఇప్పుడు వివరాలు వెల్లడించలేనని అన్నారు.
ఏడు లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారు..
ధనిక రాష్ట్రం.. ధనిక రాష్ట్రం అని బీఆర్ ఎస్ ప్రచారం చేస్తోందని, ధనిక రాష్ట్రమే అయితే ఏడు లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారని గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వచ్చాయని ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు. ప్రత్యేక నిధులు వస్తేనే.., వనరులను సద్వినియోగం చేసుకుంటేనే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ది సాధ్యం అవుతుందని వివరించారు.
4 నెలల్లో 26 వేల కోట్ల అప్పు కట్టాం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల కాలంలో 26 వేల కోట్ల అప్పు తీర్చినట్లు భట్టి వివరించారు. మధ్యాహ్న భోజనానికి, మహిళా సంఘాలకు నిధులు ఇచ్చామని చెప్పారు. విద్యుత్ సబ్సిడీకి 3,927 కోట్లు చెల్లించామని వెల్లడించారు. గత ప్రభుత్వ తప్పుడు విధానాలతో, ఇప్పుడు తప్పుడు ఆలోచనలతో రాష్ట్రానికి ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వెలిబుచ్చారు.
భయాందోళనలకు గురి చేయడం కరెక్ట్ కాదు..
తప్పుడు ప్రచారాలతో ప్రజలను భయాందోళనకు గురి చేయడం కరెక్ట్ కాదని బీఆర్ ఎస్ కు సూచించారు భట్టి. వాస్తవాలు కప్పి పుచ్చి అసత్యాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించేందుకు నేను సిద్ధం అని చెప్పారు. రాష్ట్రంలో కరెంట్ ఉండడం లేదని ప్రచారం చేస్తే.. ప్రజల్లో మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరగడమే కాకుండా పరిశ్రమలు రావని, ఉన్నవి మూసేసే ప్రమాదం ఉందని, దీనివల్ల రాష్ట్రానికి పెద్ద ఎత్తున నష్టం జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలకు నిజానిజాలు తెలియాలనే మీడియా ముందుకు వచ్చినట్లు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు.
——————