నేలకొరిగిన వరి
* పూర్తయిన సర్వేలు 88 మాత్రమే
* వెంటనే నష్టం అంచనా వేయాలి
* సీఎం విష్ణు దేవ్ సాయి
ఆకేరు న్యూస్, ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లో తుపాను ప్రభావంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. మూడు రోజుల పాటు కురిసిన వర్షాలు, బలమైన ఈదురుగాలుల కారణంగా వరి పంట నేలకొరిగింది. దీంతో దాదాపు 60 వేల మంది రైతులు పంట నష్టంపై బీమా కంపెనీలకు సమాచారం అందించారు. అయితే క్షేత్రస్థాయిలో నష్టం అంచనా ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. నవంబర్ 15 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో పంట కోతలు, ధాన్యం నాణ్యతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
* మూడు రోజుల్లో 59,666 పంట నష్టం ఫిర్యాదులు
బీమా కంపెనీలు వెల్లడించిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 28 నుంచి 30వ తేదీ వరకు మొత్తం 59,666 మంది రైతుల నుంచి పంట నష్టానికి సంబంధించిన సమాచారం అందింది. వీటిలో 7,507 దరఖాస్తులను తిరస్కరించారు. మరో 50,962 కేసుల్లో సర్వే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఇప్పటివరకు కేవలం 88 క్షేత్రస్థాయి సర్వేలు మాత్రమే పూర్తయ్యాయి. మరో 1,109 సర్వేలు కొనసాగుతున్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
జిల్లాల వారీగా చూస్తే కబీర్‌ధామ్‌లో అత్యధికంగా 23,809 మంది రైతులు పంట నష్టాన్ని నివేదించారు. బాలోద్‌లో 7,237, దుర్గ్‌లో 4,897, ఖైరాగఢ్–ఛుయిఖదన్–గండైలో 4,223, బేమేతరాలో 3,671, ధమ్తరిలో 3,141 మంది రైతులు నష్టం వివరాలను బీమా సంస్థలకు తెలియజేశారు.
* నేలకొరిగిన వరి.. నాణ్యతపై ఆందోళన
తుపాను కారణంగా కవర్ధా, బాలోదాబజార్ సహా పలు వ్యవసాయ ప్రాంతాల్లో చేతికొచ్చే దశలో ఉన్న వరి పంట నేలకొరిగింది. పొలాల్లో నీరు నిలిచిపోవడం, ఎక్కువసేపు తేమ ఉండటంతో ధాన్యం దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వరి కంకులు కుళ్లిపోయే అవకాశం ఉండటంతో దిగుబడిపై ప్రభావం పడుతుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి.
పంట కోత ఆలస్యమైతే మిగిలిన ధాన్యాన్ని కాపాడుకోవడం కూడా రైతులకు సవాలుగా మారనుంది. కవర్ధాం ప్రాంతానికి చెందిన ఓ రైతు నేలకొరిగిన పంటను చూసి తన ఆవేదనను ఛత్తీస్‌గఢీ పాట రూపంలో వ్యక్తం చేసినట్లు స్థానిక కథనాలు పేర్కొన్నాయి.
* నవంబర్ 15 నుంచి ధాన్యం కొనుగోళ్లు
మరోవైపు నవంబర్ 15 నుంచి ఛత్తీస్‌గఢ్‌లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. క్వింటాల్‌కు రూ.3,100 చొప్పున కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొనుగోలు ప్రక్రియ జనవరి 15 వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో పంట నష్టంపై సర్వేలు త్వరగా పూర్తికాకపోతే రైతులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మిగిలిన పంటను సకాలంలో కోసి, అవసరమైన నాణ్యతతో కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లగలమా అనే ఆందోళన వారిలో పెరుగుతోంది.
* వెంటనే నష్టం అంచనా వేయాలని సీఎం ఆదేశాలు
రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని, అర్హులైన రైతులకు రెవెన్యూ బుక్ సర్క్యులర్ 6-4 నిబంధనల ప్రకారం సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
క్షేత్రస్థాయి సర్వేలు పూర్తయిన తర్వాతే వాస్తవంగా జరిగిన పంట నష్టం ఎంతన్నది స్పష్టమవుతుంది. అయితే ధాన్యం కొనుగోళ్లకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో సర్వేలు వేగవంతం చేసి, నష్టపోయిన రైతులకు సకాలంలో సహాయం అందించాలని అన్నదాతలు కోరుతున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

