కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
అమరావతి: రాష్ట్రంలో ఏ మున్సిపాల్టీలో కూడా చెత్త కనపడటానికి వీల్లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chief Minister Nara Chandrababu Naidu) అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సు (Collectors Conference) లో ఆయన మాట్లాడుతూ పట్టణాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంటువ్యాధుల పట్ల శ్రద్ద కనబరచాలన్నారు. క్రమం తప్పకుండా నీటి పరీక్షలు నిర్వహించడంతో పాటు దోమల బెడద నివారించడానికి డ్రోన్ సహకారం తీసుకోవాలని సూచించాలి. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు స్వయం సమృద్ధితో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులు ఇచ్చిన విరాళాలతో రూ.వెయ్యి కోట్ల కార్పస్ ఫండ్స్ ఏర్పాటు చేసి టీటీడీ (TTD) నిత్యాన్నదానం కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. అలాగే అన్నా క్యాంటీన్లు కూడా దాతల నుంచి విరాళాలు సేకరించి స్వయం సమృద్ది సాధించి నిర్వహణ జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. దాతలకు స్ఫూర్తి కలిగించేలా ఈ కార్యక్రమాన్ని ఏవిధంగా ముందుకు తీసుకెళ్లితే బాగుంటుందో వినూత్న ఆలోచనలతో అధికారులు ముందుకు రావాలని కోరారు.
—————-