CM chandrababu naidu Veligonda Project
* వెలుగుల వెలిగొండతో తీరనున్న కరువు
* ప్రాజెక్టు నిర్మాణానికి 1996లో శంకుస్థాపన
* సీపీఐ నేత “పూల సుబ్బయ్య”గా నామకరణం
* నేడు జాతికి అంకితం చేసిన ఏపీ సీఎం
* 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు
* 15.25 లక్షల మందికి తాగునీరు
ఆకేరు న్యూస్, డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో నేడు భారీ నీటి పారుదల ప్రాజెక్టు అందుబాటులో వచ్చింది. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. కృష్ణా జలాలకు హారతి ఇచ్చి గేట్లు ఎత్తి విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం ముందు భాగంలోని కొల్లం వాగు నుంచి 2 సొరంగ మార్గాల ద్వారా, ఆ తర్వాత కాలువ ద్వారా నిండి.. నల్లమల కొండల శ్రేణిలో సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద ఖాళీల్లో కట్టిన ఆనకట్ట ద్వారా ఏర్పడిన జలాశయంలో నిండిన నీళ్లు.. బిరబిరా పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్నాయి. వెలిగొండ బంగారు కొండ అవుతుందని కూటమి ప్రభుత్వం సగర్వంగా చెబుతోంది. ఈ సందర్భంగా ప్రాజెక్టు విశేషాలు..
* 30 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీ రామారావు హయాంలో తొలిసారిగా ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు రూపుదిద్దుకున్నాయి. 1996 మార్చి 5న నాటి సీఎం చంద్రబాబు నాయుడు మార్కాపురం సమీపంలోని గొట్టిపడియ వద్ద రూ. 980 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. సీపీఐ నేత, మాజీ ప్రజాప్రతినిధి దివంగత పూల సుబ్బయ్య జ్ఞాపకార్థం ఈ ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత 2004 అక్టోబర్ 27న గొట్టిపడియ వద్ద మళ్లీ ప్రారంభించారు. 2007లో ప్రారంభమైన మొదటి సొరంగం తవ్వకం పనులు 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఒకటో టన్నెల్ 2021లో పూర్తయ్యాయి. రెండో టన్నెల్ నిర్మాణం (2008 – 2024): 2008లో ప్రారంభమైన రెండో టన్నెల్ పనులు 2024 మార్చి 5 నాటికి పూర్తయ్యాయి. 2024 మార్చి 6న ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లి వద్ద అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2 టన్నెళ్ల పనులను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను వేగవంతం చేశారు. బాధితులకు పరిహారం అందించి మార్గం సుగమం చేశారు. నేడు వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
* పూల సుబ్బయ్య గా పేరు ఎలా వచ్చిందంటే..
వెలిగొండ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా గతంలోనే నామకరణం చేశారు. ఆ పేరుకు ఓ ప్రత్యేకత ఉంది. పూల సుబ్బయ్య అంటే ఒక ఉద్యమం.. ఒక ఆశయం.. ఒక ప్రజా సంకల్పం. ఆయన పోరాటానికి సంకల్పంగా నిలిచింది ఈ ప్రాజెక్టు. మాజీ ఎమ్మెల్యే దివంగత పూల సుబ్బయ్య నిరుపేదలు, రైతాంగ హక్కుల కోసం తన జీవితాంతం పోరాడిన ఆయన, కరువు పీడిత ప్రాంతానికి నీటి వెలుగులు అందించడంలో ప్రధాన పాత్ర పోషించారు. సీపీఐ సీనియర్ నేతగా మార్కాపురం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై సుదీర్ఘకాలం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తారు. శ్రీశైలం ప్రాజెక్టు వెనక జలాలను నల్లమల కొండల గుండా మళ్లించి పశ్చిమ ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు తరలించవచ్చని తొలిసారిగా శాస్త్రీయంగా ప్రతిపాదించింది ఆయనే. ఈ ప్రాజెక్టు సాధన కోసం అలుపెరగని ఉద్యమాలు చేపట్టారు. ఆ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చే ప్రాజెక్టు రూపకల్పనలో ఆయన చేసిన అసమాన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం ఈ పథకానికి ‘పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు’గా పేరు పెట్టి ఆయన నివాళిని సార్థకం చేసింది. ప్రాజెక్టు తొలి దశ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన కుమార్తెలను సీఎం చంద్రబాబు సత్కరించారు.
* ప్రాజెక్ట్ విశేషాలు..
– ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లోని దాదాపు 4.47 లక్షల ఎకరాలకు వెలిగొండ ద్వారా సాగునీరందనుంది.
– 15.25 లక్షల మందికి సురక్షిత తాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.
– 1996లో సీఎం చంద్రబాబే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. మళ్లీ ఇప్పుడు ఆయన చేతుల మీదుగానే ప్రారంభించి జాతికి అంకితం కావడం చరిత్రాత్మక ఘట్టంగా మారింది.
– శ్రీశైలం ప్రాజెక్టు వద్ద వర్షాకాలంలో నీటి మట్టం 52 అడుగులకు (పూర్తి సామర్థ్యానికి) చేరుకున్నప్పుడు, అక్కడ లభించే అదనపు కృష్ణా జలాలను గ్రావిటీ (గురుత్వాకర్షణ) ద్వారా మళ్లిస్తారు.
– నల్లమల అటవీ ప్రాంతం గుండా తవ్విన 2 భారీ సొరంగాల ద్వారా నీటిని బయటకు తరలిస్తారు.
– సొరంగాల నుంచి 18.88 కి.మీ. ఫీడర్ కాలువ ద్వారా దాదాపు 54 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ‘నల్లమల సాగర్’ సహజ సిద్ధ రిజర్వాయర్‌కు నీరు చేరుతుంది.
– నల్లమల సాగర్‌లోని 3ప్రధాన గేట్ల ద్వారా డిస్ట్రిబ్యూటరీ కాలువల్లోకి నీటిని విడుదల చేసి సాగు, తాగునీరందిస్తారు.
– మార్కాపురం జిల్లాలోని 21 మండలాలు, ప్రకాశం జిల్లాలో 2, నెల్లూరులో 5 , కడప జిల్లాలోని 2 మండలాలు.. మొత్తంగా 30 మండలాల్లోని 4,47,000 ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరందుతుంది.
– ఫ్లోరైడ్, వర్షాభావ సమస్యలతో బాధపడుతున్న ఈ 30 మండలాల పరిధిలోని 15.25 లక్షల మంది ప్రజలకు సురక్షితమైన తాగునీటి సౌకర్యం లభిస్తుంది.
– ఫేజ్-1 ద్వారా దాదాపు 1.19 లక్షల ఎకరాలకు సాగునీరందనుంది. దీంతో పాటు మార్గమధ్యంలో ఉన్న 4 లక్షల మంది ప్రజలకు స్వచ్ఛమైన, ఫ్లోరైడ్ రహిత తాగునీరు అందుబాటులోకి రానుంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
