ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు మరియు పెండింగ్లో ఉన్న రక్షణ భూముల అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. ఫిబ్రవరి చివరి వారంలో మూసీ మరియు ఈసా నదుల సంగమ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కేంద్ర మంత్రిని సీఎం ఆహ్వానించారు. 1948 ఫిబ్రవరిలో మహాత్మా గాంధీ చితాభస్మాన్ని ఈ నదీ సంగమ ప్రాంతంలోనే నిమజ్జనం చేశారని, ఆ జ్ఞాపకార్థం ఈ ప్రాజెక్టును అంతర్జాతీయ స్థాయి విద్యా, ఆధ్యాత్మిక మరియు పర్యావరణ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని సీఎం వివరించారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ విజన్ డాక్యుమెంట్-2047’ను ముఖ్యమంత్రి రాజ్నాథ్ సింగ్కు అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను ఆయనకు వివరించారు.గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన సుమారు 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. జాతీయ సమైక్యతకు చిహ్నంగా నిలిచే ఈ ప్రాజెక్టుకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ గౌడ్, వంశీకృష్ణ, మరియు కడియం కావ్య తదితరులు పాల్గొన్నారు.
