* నాపై కేసులు పెట్టండి…
* నా కుటుంబాన్ని, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకండి
ఆకేరు న్యూస్, కమలాపూర్ :
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామంపై సామాజిక మాధ్యమాల్లో స్పందించిన కౌశిక్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి గారు, నన్ను లక్ష్యంగా చేసుకోండి, నాపై కేసులు పెట్టండి, నాకు నోటీసులు ఇవ్వండి.. కానీ ఏ తప్పు చేయకపోయినా నా కుటుంబాన్ని, నా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం సరికాదు అంటూ ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమకు, తమ కుటుంబ సభ్యులకు సీఐడీ నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు.
ఈ నోటీసుల వెనుక ఉన్న ప్రధాన కారణాలను పరిశీలిస్తే.. జనవరి 29న హుజూరాబాద్‌లోని కె.సి. క్యాంప్ చౌరస్తా వద్ద సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్ల సమయంలో జరిగిన ఒక సంఘటన దీనికి మూలమని తెలుస్తోంది. ఆ సమయంలో పోలీసుల బందోబస్తు విధులకు ఆటంకం కలిగించారని, మద్దతుదారులతో కలిసి చట్టవిరుద్ధంగా రోడ్డుపై కూర్చుని వాహనాల రాకపోకలను అడ్డుకున్నారని కౌశిక్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, కరీంనగర్ పోలీస్ కమిషనర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులపై అవమానకరమైన, దూషణాత్మక వ్యాఖ్యలు చేశారని, వారిని బెదిరించారని సీఐడీ తన నోటీసులో పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీని ఆధారంగా చేసుకుని, ఏప్రిల్ 4న విచారణకు హాజరై సహకరించాలని అధికారులు ఆదేశించారు.
అయితే, ఈ నోటీసులకు తాను భయపడే ప్రసక్తే లేదని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గనని, ప్రజల తరఫున తన పోరాటం కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తన గొంతు ఆగదని, ఇది తన వ్యక్తిగత పోరాటం కాదని, ప్రజల కోసం చేస్తున్న బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతును అణచడం ఎవరికీ సాధ్యం కాదని సామాజిక మాధ్యమాల్లో కౌశిక్ రెడ్డి రాస్కొచ్చారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
