Godrej Telangana Oil Palm
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగ విస్తరణ, పారిశ్రామిక పెట్టుబడుల వృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మొట్టమొదటి ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ఏర్పాటుకు, ఆయిల్ పామ్ సాగు విస్తరణకు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశీయ ప్రముఖ సంస్థ ‘గోద్రేజ్ ఆగ్రోవెట్’ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సమావేశమై, రాష్ట్రంలో తమ ప్రతిపాదిత ప్రాజెక్టుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించింది.
మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ (MCR HRD) బోధి పెవిలియన్‌లో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో గోద్రేజ్ గ్రూపు సంస్థల కార్పొరేట్ అఫేర్స్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి, ఆగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగత నియోగి తదితరులు ముఖ్యమంత్రికి రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణ, ప్రైవేట్ కాంప్లెక్స్ ఏర్పాటుపై ఒక సమగ్ర నివేదికను సమర్పించారు.
* 700 మందికి ఉపాధి..
ఖమ్మం జిల్లాలో గోద్రేజ్ సంస్థ దాదాపు రూ.300 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మిస్తోంది. దీని ద్వారా స్థానికంగా 700 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్, అత్యాధునిక నర్సరీ, పరిశోధన – అభివృద్ధి (R&D) కేంద్రం, మరియు నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి కోసం ‘సీడ్ గార్డెన్’ను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ మెగా ప్రాజెక్ట్ కోసం ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో ప్రభుత్వం ఇప్పటికే 113.5 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రతినిధులు పేర్కొన్నారు.
* ప్రభుత్వానికి గోద్రేజ్ అభ్యర్థన.. సీఎం సానుకూల స్పందన
రాష్ట్రంలో ఆయిల్ పామ్ విత్తనోత్పత్తిని మరింత పెంచేందుకు వీలుగా, సీడ్ గార్డెన్ విస్తరణ కోసం అదనంగా మరో 35 నుంచి 40 ఎకరాల భూమిని కేటాయించాలని గోద్రేజ్ ప్రతినిధులు ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. వీటితో పాటు, రాబోయే రోజుల్లో భారీ వాహనాల రాకపోకలకు వీలుగా ప్రాసెసింగ్ యూనిట్‌కు వెళ్లే రహదారిని విస్తరించాలని కోరారు.
కంపెనీ ప్రతినిధుల అభ్యర్థనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి, రైతులకు లబ్ధి చేకూర్చే ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ప్లాంట్ కనెక్టివిటీకి అవసరమైన రోడ్డు విస్తరణ పనులను తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (TGIIC) ఆధ్వర్యంలో తక్షణమే చేపట్టాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.
తెలంగాణను ఆయిల్ పామ్ సాగులో అగ్రగామిగా నిలిపేందుకు మరియు రైతులకు ప్రత్యామ్నాయ వాణిజ్య పంటల ద్వారా లాభసాటి ఆదాయాన్ని అందించేందుకు ఈ ప్రాజెక్ట్ ఎంతగానో దోహదపడుతుందని వ్యవసాయ రంగా నిపుణులు భావిస్తున్నారు.
