Kadiyam Srihari Response Controversy
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
అధికారాన్ని అభివృద్ధి కోసం, ప్రజల కోసం ఉపయోగించాలి కానీ కాంట్రవర్సీ కోసం కాదని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని బుధవారం నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం రైతుబంధు విడుదల చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కొండ సురేఖ అధిష్టానానికి చేసిన ఫిర్యాదులపై కడియం విలేకరులు ప్రశ్నించగా ఈ విధంగా స్పందించారు. ఒక ఎమ్మెల్యేగా, ప్రజా ప్రతినిధిగా ఏ అధికారినైనా కలిసే హక్కు నాకు ఉంది అన్నారు. నా నియోజకవర్గ సమస్యలు తెలపడం ఎమ్మెల్యేగా నా హక్కు, బాధ్యత అన్నారు.
నాకు రూల్స్ తెలుసు.. నేను ఎక్కడా రూల్స్ అతిక్రమించలేదు, బిజినెస్ రూల్స్, రాజ్యాంగ ప్రకారం క్యాబినెట్ ర్యాంక్ లో ఉన్నవారు మాత్రమే సమీక్ష చేస్తారు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమీక్షలో పాల్గొంటారని వివరించారు. నా నియోజకవర్గ పరిధిలోని ఆలయాల అభివృద్ధిపై వారి కార్యాలయానికి వెళ్లి దేవాదాయ శాఖ కమిషనర్ ని కలిసాను. ఆలయాల అభివృద్ధికి ఆలయ కమిటీ చైర్మన్లతో కలిసి పలు వినతి పత్రాలు అందజేశాను అన్నారు. నేను తప్పు చేయనప్పుడు ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదన్నారు. కొందరు అవగాహనా లోపంతో మాట్లాడుతున్నారు. నా అధికారాలు, పరిమితులు ఏంటో నాకు తెలుసు అన్నారు. నాపై ఇలాంటి వార్తలు రావడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి గురించి ఆలోచించని వారు, ప్రజల మధ్యలో ఉండని వారు కాంట్రావర్సీలు సృష్టించి వార్తల్లో ఉండాలని చూస్తారు. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా అనవసర విషయాలపై దృష్టి పెడుతున్నారు అన్నారు.
ఉమ్మడి జిల్లాను పట్టించుకునే వారే లేకుండా అయ్యారు, వర్షాబావ పరిస్థితుల నేపథ్యంలో దేవాదుల పై దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఎవరిదీ?
ఎంజీఎం ఆసుపత్రికి సూపరిండెంట్ లేడు ఎవరూ పట్టించుకోవాలి ?
సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం చేయాలి దాన్ని పట్టించుకునే వారే లేరు? అండర్ గ్రౌండ్ డ్రైనేజి టెండర్లు పూర్తి చేయించి పనులు ప్రాంభించడానికి చొరవ తీసుకోవాల్సింది ఎవరు? అని ప్రశ్నించారు. అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలి తప్ప కాంట్రావర్సీల కోసం కాదని శ్రీహరి వివరించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
