Heavy Rains India Alert
* దిల్లీ జలమయం
ఆకేరు న్యూస్, డెస్క్: దేశంలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ముంబయి, దిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌తో పాటు కేరళ, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
* ముంబయికి ‘ఆరెంజ్ అలర్ట్’..
వాణిజ్య రాజధాని ముంబయిని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రధాన రహదారులపైకి మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాగల కొన్ని గంటల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ముంబయికి ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ఎన్డీఆర్ఎఫ్ (NDRF) సహా స్థానిక సహాయక బృందాలను అధికారులు అప్రమత్తం చేశారు.
* స్తంభించిన దిల్లీ, యూపీ..
దేశ రాజధాని దిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలోనూ వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంది. దిల్లీలోని పలు సబ్‌వేలు, అండర్ పాస్‌లు నీట మునిగాయి. ట్రాఫిక్ జామ్‌లతో వాహనదారులు నరకం చూస్తున్నారు.
* కొండ ప్రాంతాల్లో పెరుగుతున్న ముప్పు..
మరోవైపు, దక్షిణ భారతాదేశంలో కేరళను వానలు ముంచెత్తుతుండగా.. ఉత్తరాదిన జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలోని కొండ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో.. ప్రజలు ఎవరూ నదీ తీర ప్రాంతాలకు వెళ్లవద్దని, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని స్థానిక యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది.
పరిస్థితిని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, స్థానిక విపత్తు నిర్వహణ శాఖలు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
