Telangana Police Reform Plan
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో మారుతున్న నేరాల స్వరూపం, పెరుగుతున్న సైబర్ నేరాలను సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆధునిక అవసరాలకు అనుగుణంగా శాంతిభద్రతలను కాపాడటంతో పాటు, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా అందిపుచ్చుకోవాలని అధికారులను ఆదేశించారు.
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో తెలంగాణ శాంతిభద్రతలు, ఆధునిక పోలీసు విధానాలపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీనియర్ పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ కీలక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, రాష్ట్ర భద్రతా సలహాదారు బి. శివధర్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు అదనపు డీజీలు, పోలీసు కమిషనర్లు, ఐజీలు, ఉన్నత స్థాయి పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఈ భేటీలో ముఖ్యమంత్రి తీసుకున్న ముఖ్య నిర్ణయాలు, ఆదేశాల వివరాలు.
* సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక విభాగాలు
పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు ప్రత్యేకంగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలి. సైబర్ నేరాల విభాగంలో పనిచేసేందుకు పోలీసు శాఖలో ప్రత్యేక ఎంపిక ప్రక్రియ చేపట్టాలి. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో పోలీసు విభాగం కోసం ప్రత్యేక కోర్సును ప్రారంభించాలి.
* ఆధునిక సాంకేతికత – నిఘా వ్యవస్థ
పోలీసింగ్‌లో ఆధునిక సాంకేతికతను ముమ్మరంగా వాడాలి. డ్రోన్ పోలీసింగ్, సీసీ కెమెరాల సంఖ్యను భారీగా పెంచాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను వంద శాతం సమర్థవంతంగా వినియోగించుకోవాలి. రాత్రి వేళల గస్తీ (నైట్ పెట్రోలింగ్), గ్రామాల్లో పోలీసు వ్యవస్థలను బలోపేతం చేయాలి. కాలం చెల్లిన ఆయుధాలను తక్షణమే తొలగించాలి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అదనపు ఫోరెన్సిక్ కేంద్రాలు, డేటా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఎస్ఐ స్థాయి నుంచి నాన్-క్యాడర్ ఐపీఎస్ వరకు పదోన్నతి పొందిన వారు కచ్చితంగా రెండేళ్ల పాటు ఇతర విభాగాల్లో పనిచేసేలా నిబంధన తేవాలి.
* డ్రగ్స్, ఆహార కల్తీపై ఉక్కుపాదం
డ్రగ్స్ మహమ్మారి బారిన పడిన బాధితుల కోసం ప్రత్యేక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి. గంజాయి రవాణాపై నిరంతర నిఘా ఉంచాలి.
సమాజానికి శాపంగా మారిన ఆహార కల్తీ వల్ల క్యాన్సర్ కేసులు పెరుగుతుండటంపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ సూత్రధారులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఆదేశించారు.
* విజిలెన్స్, ఫైర్ విభాగాల బలోపేతం
ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేవారిపై మరియు వ్యవస్థీకృత నేరాల పైన విజిలెన్స్ విభాగం సమాచార విశ్లేషణ ఆధారంగా ప్రత్యేక దృష్టి పెట్టాలి. అవసరమైతే విజిలెన్స్‌కు మరిన్ని అధికారాలు కల్పిస్తాం. అగ్ని ప్రమాదాలు జరిగిన తర్వాత కాకుండా, అసలు ప్రమాదాలు జరగకుండా చూసేలా అగ్నిమాపక విభాగం, మునిసిపల్ మరియు హైడ్రా విభాగాలతో సమన్వయం చేసుకోవాలి. దీనిపై జూన్ 15 లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలి. నాలాల నిర్వహణ, మ్యాన్‌హోల్స్ భద్రత విషయంలో వాటర్ వర్క్స్, పోలీస్, ట్రాఫిక్ పోలీస్, హైడ్రా, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలి.
నగరంలో అడ్డగోలుగా వెలుస్తున్న ఫ్లెక్సీలపై కఠినంగా వ్యవహరించాలని జీహెచ్ఎంసీ, పోలీసు కమిషనర్లను ఆదేశించారు.
* నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
“శాంతిభద్రతల పరిరక్షణ ఒక పవిత్రమైన బాధ్యత. పోలీసు శాఖలో జవాబుదారీతనం పెరగాలి. పరిధి దాటి ప్రవర్తిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, అలాంటి అధికారులను అంగీకరించే ప్రసక్తే లేదు” అని ముఖ్యమంత్రి గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఎస్పీలు నిరంతరం జిల్లాల్లో, ఐజీలు తమ పరిధుల్లో పర్యటించాలి. క్రైమ్ రివ్యూ మీటింగ్‌లు తప్పనిసరిగా జరగాలి. రౌడీషీటర్లపై ఎప్పటికప్పుడు నిఘా ఉండాలి.
* పోలీసుల సంక్షేమం – శాఖలో ఎలక్ట్రిక్ వాహనాలు
పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా పోలీసు డిపార్ట్మెంట్లోని వాహనాలన్నింటినీ ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.
బదిలీలు, పోస్టింగుల్లో అవినీతికి తావులేకుండా కేవలం ప్రతిభ ప్రాతిపదికన మాత్రమే పోస్టింగులు ఇవ్వాలని స్పష్టం చేశారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ను ఒకే యూనిట్ కిందికి తీసుకురావాలని, ప్రముఖులు, సెలబ్రిటీల కార్యక్రమాల అనుమతుల్లో జాగ్రత్తలు వహించాలని ముఖ్యమంత్రి సూచించారు.
