* ప్రభుత్వ చిహ్నంలో కాకతీయ కళాతోరణంపై స్పష్టత ఇవ్వాలని ఆందోళనలు
* పలువురు నేతల గృహ నిర్భంధం
* ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరిన సీఎం
* వరంగల్, హనుమకొండల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
* డీఎస్ మృతి నేపథ్యంలో షెడ్యూల్లో మార్పునకు చాన్స్!
ఆకేరు న్యూస్, వరంగల్ : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నేడు వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈమేరకు ఇప్పటికే ఢిల్లీ నుంచి ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలోని మెగా టెక్స్టైల్ పార్కుకు చేరుకోనున్నారు. మెగా టెక్స్టైల్ పార్కుకు (Mega Textile Park) సంబంధించిన అధికారులతో సమీక్ష నిర్వహించి, ఫొటో ఎగ్జిబిషన్ తిలకిస్తారు. వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2.10 గంటలకు వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని పరిశీలించనున్నారు. అక్కడి నుంచి 2.45 గంటలకు హనుమకొండ కలెక్టరేట్‌కు చేరుకుని మహిళ శక్తి క్యాంటీన్లను ప్రారంభిస్తారు. 3 గంటలకు కలెక్టరేట్లో వరంగల్ మహానగర అభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 5.40 గంటలకు హంటర్ రోడ్డులో నూతనంగా నిర్మితమైన మెడికవర్ ఆస్పత్రిని ప్రారంభించనున్నారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ మృతి నేపథ్యంలో షెడ్యూల్ స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. డీఎస్ పార్థిదేహాన్ని ముఖ్యమంత్రి సందర్శించి నివాళులు అర్పించనున్నారు.
బీఆర్ ఎస్ నేతల గృహ నిర్భంధం
సీఎం వరంగల్ పర్యటన నేపథ్యంలో ఆందోళనలు చేపట్టేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధమయ్యారు. ప్రభుత్వ చిహ్నంలో కాకతీయ కళాతోరణం తొలగిస్తారన్న ప్రచారం నేపథ్యంలో నిరసనలకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. చిహ్నంలో కళాతోరణంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఎం షెడ్యూల్‌కు ఆటంకాలు కలగకుండా చర్యలు చేపడుతున్నారు. ముందస్తు అరెస్టులకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ నేత రాకేష్‌రెడ్డి సహా పలువురు ముఖ్యులను గృహ దిగ్బంధం చేశారు.
——————–