CM Revanth Visits Urukondapeta After 20 years
* ఆలయ అభివృద్ధికి రూ. 10 కోట్లు
ఆకేరు న్యూస్, నాగర్కర్నూల్ :
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో తొలి అడుగులు వేసిన నాగర్కర్నూల్ జిల్లా ఉరుకొండపేట గ్రామంలో పర్యటించారు. సీఎం హోదాలో మొదటిసారి గ్రామానికి రావడంతో స్థానిక ప్రజలు, ఆనాటి రాజకీయ సహచరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. సీఎం రాకతో ఉరుకొండపేటలో పండుగ వాతావరణం నెలకొంది.
* ఆలయ దర్శనం.. రూ.10 కోట్లతో శంకుస్థాపన
పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఉరుకొండపేట పబ్బతి ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పురోహితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం, ఉరుకొండపేట క్షేత్రాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.

* 20 ఏళ్ల నాటి జ్ఞాపకాలు.. ఆత్మీయ సమ్మేళనం
సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతం నుంచి జెడ్పీటీసీగా ఎన్నికైన నాటి మరువలేని అనుభూతులను రేవంత్ రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో అలనాటి తోటి సహచరులను, పెద్దలను పేరుపేరునా అప్యాయంగా పలకరించారు. ఒక్కొక్కరితో కరచాలనం చేస్తూ వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కొందరు పాత మిత్రులు రెండు దశాబ్దాల క్రితం రేవంత్ రెడ్డితో కలిసి దిగిన అరుదైన ఫోటోలను చూపించగా, ఆయన వాటిని ఆసక్తిగా చూస్తూ పాత రోజులను నెమరువేసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నా, నాటి మిత్రుల పట్ల ఆయన చూపిన ఆప్యాయత అక్కడి వారిని ఆకట్టుకుంది.
* తరలివచ్చిన ప్రముఖులు..
ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణా రావు, వాకిటి శ్రీహరి, ఎంపీలు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డిలతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

