* కాంగ్రెస్, బీజేపీ ప్రచార అస్త్రం అదే
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు ఎక్కడ చూసినా గాడిదగుడ్డు కనిపిస్తోంది. రాజకీయ నేతల మాటల్లోనూ ఆ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. అటు కాంగ్రెస్ అయినా, ఇటు బీజేపీ అయినా గాడిదగుడ్డునే ఎక్కువగా ప్రచారం చేస్తున్నాయి. ఇంతకీ ఏంటీ గాడిదగుడ్డు గోల అనుకుంటున్నారా..? ఒకవేళ దాన్ని ఏ పార్టీకైనా గుర్తుగా కేటాయించారని భావిస్తున్నారా? అదేం లేదు.. తెలంగాణకు బీజేపీ ఇచ్చింది.. గాడిదగుడ్డు అని కాంగ్రెస్ విమర్శిస్తుంటే.., తెలంగాణకు కాంగ్రెస్ గ్యారెంటీ – గాడిదగుడ్డు.. అని బీజేపీ ప్రచారం చేస్తోంది. కాషాయపార్టీ శనివారం తాజాగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారుతోంది.
కాంగ్రెస్ తెరపైకి తెచ్చిన ‘‘గాడిద గుడ్డు’’
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తొలుత ఈ గాడిదగుడ్డు కాన్సెప్ట్ ను కాంగ్రెస్ పార్టీనే తెరపైకి తెచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో ప్రధానిమోదీని విమర్శిస్తూ.. ఏపీకి మట్టిని, కర్ణాటకకు చెంబును.. తెలంగాణకు ‘‘గాడిద గుడ్డు’’ ఇచ్చారని ప్రచారం మొదలుపెట్టారు. అంతేకాదు.. పలుచోట్ల భారీ స్థాయిలో ప్రత్యేకంగా తయారుచేసిన ‘‘గాడిద గుడ్డు’’ ను ప్రదర్శిస్తున్నారు. రేవంత్ సైతం కొన్నిచోట్ల ‘‘గాడిద గుడ్డు’’ను చూపుతూ ప్రచారం చేస్తున్నారు.
బీజేపీ కౌంటర్
కొద్ది రోజులుగా రేవంత్ చేస్తున్న ‘‘గాడిద గుడ్డు’’ ప్రచారానికి బీజేపీ కూడా కౌంటర్ మొదలుపెట్టింది. తెలంగాణలో ‘గాడిద గుడ్డు’ పాలన సాగుతోందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్రెడ్డి అన్నారు. ఇంతకుముందు కేసీఆర్ హామీలిచ్చి మసిపూసి మారేడుకాయ చేసేవారని,. ఇప్పుడు రేవంత్ రెడ్డి హామీల అమలు బదులు గాడిదగుడ్డు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. రేవంత్ ఎక్కడకు వెళ్లినా చెయ్యి గుర్తు బదులు గాడిద గుడ్డును తలపై పెట్టుకుని ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్.. చెయ్యి గుర్తు నుంచి గాడిద గుడ్డు గుర్తుకు మారినట్లుందని ఎద్దేవా చేశారు. తాజాగా ఈరోజు బీజేపీ ట్విట్టర్ లో చేసిన పోస్టు వైరల్గా మారింది. కాంగ్రెస్ గ్యారెంటీ – గాడిదగుడ్డు పేరుతో.. 2 లక్షల రైతు రుణమాఫీ ఒకటో గాడిదగుడ్డు, వరికి రూ. 500 బోనస్ 2వ గాడిదగుడ్డు, కౌలురైతులకు రూ.15000 రైతుభరోసా 3వ గాడిదగుడ్డు, రైతుకూలీలకు 12000 సహాయం 4వ గాడిదగుడ్డు, విద్యార్థులకు రూ.5లక్షలు 5వ గాడిదగుడ్డు, నిరుద్యోగులకు 4000.. 6వ గాడిదగుడ్డు, మహిళలకు 25000.. 7వ గాడిదగుడ్డు.. అని చేసిన టీబీజేపీ చేసిన పోస్టు సంచలనంగా మారింది.
—————————-